గేటు పనులు వేగవంతం


Thu,October 10, 2019 03:09 AM

-మూసీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న గేటు భాగాలు
-హైదరాబాద్ నుంచి మిగిలిన భాగాల రాక
-పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు 5వ నెంబర్ గేటు ఇటీవల ఊడిపోవడంతో దాని స్థానంలో కొత్తదానిని ఏర్పాటు చేసే పనులు ప్రారంభమయ్యాయి. నూతన గేటును ఏర్పాటు చేసేందుకు అవసరమైన భాగాలు మంగళవారం తిరుపతి నుంచి ప్రత్యేక వాహనంలో ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన గేటును ఏర్పాటు చేసేందుకు అవసరమైన భాగాలను యుద్ధప్రాతిపదికన తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆ మేరకు ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఏపీలోని తిరుపతి వద్ద ఉన్న గేటును ప్రత్యేక వాహనంలో ఇక్కడికి తీసుకువచ్చారు. గేటు ఏర్పాటుకు అవసరమైన మిగిలిన కొన్ని భాగాలు హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకునే అవకాశం ఉంది. అవి రాగానే వాటిని ఒక్కచోట చేర్చి గురువారం గేటును బిగించే అవకాశం ఉంది.

మూసీ నీటిమట్టం 622 అడుగులు
మూసీ ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ప్రాంతం నుంచి దిగువకు నీటివృథా కొనసాగుతూనే ఉంది. గేటు నుంచి 9వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మమత తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు)అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 622 (0.7 టీఎంసీలు)అడుగులుగా ఉంది. మూసీ నది ఎగువ ప్రాంతాల నుంచి 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గేటును ఏర్పాటు చేసే సమయానికి ప్రాజెక్టు కనీస మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు పరిధిలో సాగు చేసుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే భరోసాతో రైతులు ఉన్నారు.

పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మంగళవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న గేటు భాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గేటు ఏర్పాటుకు అవసరమైన భాగాలను తీసుకువచ్చి త్వరితగతిన బిగించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చూస్తామని, ఆయక ట్టు రైతులెవరూ అధైర్యపడవద్దని ప్రాజెక్టును నిం పేందుకు చర్యలు తీసుకుంటామని మం త్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఈఈ భద్రునాయక్, డీఈ నవీకాంత్, ఏఈలు రమేష్, మమత, స్వప్న ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...