మూసీ ప్రాజెక్టు గేటు ధ్వంసం


Sun,October 6, 2019 01:41 AM

-5వేల క్యూసెక్కులకు పైగా దిగువకు..
-ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి
-పరిస్థితిపై సమీక్ష.. నష్టనివారణ చర్యలకు ఆదేశం

కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు 6వ నెంబరు రెగ్లేటర్ గేటు శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఊడిపోయింది. ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను అధికారులు సరిగా అంచనా వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 644.80 అడుగులకు చేరడంతో పాటు ఎగువ నుంచి 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నప్పటికీ గేట్లను ఎత్తకపోవడంతో వాటిపై ఒత్తిడి పెరిగి 6వ నెంబరు రెగ్లేటర్ గేటు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీరు భారీగా దిగువకు వెళ్తోంది. సుమారు 5 వేల క్యూసెక్కుల వరకు నీరు గేటు ద్వారా దిగువకు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. తెల్లవారే సరికి దాదాపు 10 అడుగులకు పైగా నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లే అవకాశం ఉంది. రెండు సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో యాసంగికి నీళ్లు వస్తాయని రైతులు సంబురపడుతున్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు పోతుండటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయకట్టు పరిధిలో 30 వేల ఎకరాల భూములకు సాగునీరందక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

పరిస్థితిని సమీక్షించిన మంత్రి జగదీష్‌రెడ్డి
మూసీ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శనివారం రాత్రి హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రాజెక్టు గేటు ఏ విధంగా ఊడిపోయిందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేటు ఊడిపోవడం దురదష్టకరమన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని పిలిపించి నీరు వృథాకాకుండా చూస్తామన్నారు. దిగువ మూసీకి వరద ఉధృతి పెరుగుతున్నందు దాని పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట మాజీ ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, తదితరులు ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...