ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు


Sat,October 5, 2019 03:41 AM

-ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు
-అద్దెబస్సులతో పాటు స్కూల్ బస్సులు నడుపనున్న అధికారులు
-తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి సన్నాహాలు
-జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ వీడియో కాన్ఫరెన్స్
-ఏర్పాట్లపై ఆరా, సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు

నల్లగొండ సిటీ : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రవాణా సౌకర్యం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. అద్దె బస్సులను యధాతథంగా నడిపించడంతో పాటు కార్పొరేషన్ బస్సులకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించనున్నారు. ఈమేరకు ఆర్టీఏ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసి విధులు అప్పగించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 4 డిపోల్లో 318బస్సులు, మరో 112అద్దె బస్సులు నడుస్తున్నాయి. రోజుకు రూ.50నుంచి 60లక్షల ఆదాయం సమకూరుతోంది. సమ్మె ప్రభావం కొనసాగితే ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

స్కూల్ బస్సులు నడిపేందుకు సిద్ధం..
బస్సుల కొరత రాకుండా స్కూల్ బస్సులను నడిపించే అవకాశాలున్నాయి. తాత్కాలిక అనుమతులు ఇచ్చి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో ఆయా యాజమాన్యాలతో మాట్లాడి ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం...
ఆర్‌టీఓ అధికారులతో డ్రైవర్లను ఎంపిక చేసి నియమించనున్నారు. కండక్టర్లను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు. డ్రైవర్‌కు రోజు వారీ వేతనం రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చెల్లించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కండక్టర్‌గా పనిచేయడానికి అర్హులని పేర్కొన్నారు. అదే విధంగా డ్రైవింగ్‌లో అనుభవం, హెవీ లైసెన్స్ కల్గిన వారికి డ్రైవర్‌గా అవకాశం కల్పించనున్నారు.

బస్సులు నడిపే రూట్లు..
-నల్లగొండ డిపో నుంచి హైదరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేటకు బస్సులు నడుపనున్నారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్, నల్లగొండ, దేవరకొండ, కోదాడ
-నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేటకు బస్సులు నడుస్తాయి. దేవరకొండ నుంచి హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, డిండి, అచ్చంపేట రూట్లలో బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
దసరా పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులు నడిపిస్తాం.
- వెంకన్న, రీజినల్ మేనేజర్, ఆర్టీసీ
కార్మికుల డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె...
కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే డిమాండ్లు పరిష్కరించాలి.
-నరేందర్,టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...