ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలి


Sat,October 5, 2019 03:37 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మె తరుణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, రవాణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకోవాలన్నారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని, సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణ శాఖ జాయింట్‌కమిషనర్ మమతా ప్రసాద్ అనుమతులు, తాత్కాలిక డ్రైవర్ల లైసెన్స్‌ల విషయంలో పలు సూచనలు చేశారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ గంగారామ్, ఆర్టీసీ ఆర్‌ఎం సీహెచ్.వెంకన్న, డివిజనల్ మేనేజర్ శ్యామల, డీఎం సురేష్‌కుమార్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...