విహారయాత్ర.. విషాదాంతం


Mon,September 16, 2019 03:44 AM

-దేవీపట్నం లాంచీ ప్రమాదంలో ఇద్దరు జిల్లావాసుల గల్లంతు
-చిట్యాలకు చెందిన యువకుడు సురక్షితం

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతవ్వగా.. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.
హాలియా, నమస్తే తెలంగాణ : హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్(22) అనే దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతైనట్లు సమాచారం. కుటుంబసభ్యులు, తెలిసిన సమాచారం మేరకు.. హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్ హైదారాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సైట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో హైదారాబాద్‌కు చెందిన తన స్నేహితులు రాజేష్, తరుణ్, వరంగల్‌కు చెందిన సురేష్, రాజేందర్‌తో కలిసి టూరిస్ట్ బస్‌లో భద్రాచలానికి దైవదర్శనానికి వెళ్లాడు. అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లి గోదావరి నదిలో లాంచీపై విహారయాత్రకు బయలుదేరాడు. రాజమండ్రి నుంచి భద్రాచలానికి లాంచీపై వస్తుండగా మార్గమధ్యలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి స్నేహితులు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. వారిలో కొందరు ఆచూకీ దొరికినట్లు సమాచారం. గల్లంతైన రవీందర్ ఆచూకీ తెలియకపోవడంతో పాటు ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుండడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు-లక్ష్మి, కుటుంబసభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.

నల్లగొండ వాసి గల్లంతు
నల్లగొండసిటీ : లాంచీ ప్రమాదంలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి గల్లంతైనట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపారు. హైదరాబాద్‌లో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో తరుణ్‌రెడ్డి అవుట్ ఏఈగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పాపికొండలు టూర్‌కు వెళ్లగా అక్కడ జరిగిన ప్రమాదంలో తరుణ్‌రెడ్డి గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.

సురక్షితంగా బయటపడ్డ వనిపాకల వాసి
చిట్యాల : గోదావరి నదిలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో చిట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి కిరణ్‌కుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. కిరణ్ హైదరాబాద్‌లో హౌజింగ్‌బోర్డులో కాంట్రాక్టు ఏఈగా పని చేస్తున్నాడు. అంబర్‌పేటలోని ఏడుగురు స్నేహితులతో కలిసి ఆదివారం భద్రాచలం, పాపికొండలు సందర్శించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో లాంచీ నీట మునగగా కిరణ్‌కుమార్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం కిరణ్‌కుమార్ రంపచోడవరంలో చికిత్స పొందుతున్నాడు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...