హుజూర్‌నగర్‌లో భగీరథ జల సవ్వడులు


Fri,September 13, 2019 04:36 AM

- రెండు మున్సిపాలిటీలతోపాటు 217 గ్రామాలకు చేరిన నీరు
- ఇప్పటికే పూర్తయిన ట్రయల్ రన్
- ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పట్టించు కోకున్నా అధికారపక్షం కృషితో పనులు
- త్వరలోనే వంద శాతం పనుల పూర్తికి కసరత్తు

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజలకు అత్యంత ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. రాబోయే తరాలకు తాగునీటి సమస్య రావద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనే మిషన్ భగీరథ. ప్రతి ఒక్కరికీ 100 లీటర్ల నీటిని ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. సూర్యాపేట జిల్లాకు ఓ పక్క కృష్ణా, మరో పక్క గోదావరి నదులు ప్రవహిస్తుండగా వాటి ద్వారా గడపగడపకు నీటిని అందించేలా పథకాలు రూపొందించగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ జిల్లాలో ఓ పక్కకు పాలేరు, మరో పక్క నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ద్వారా రూపకల్పన చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే నిమిత్తం సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో పథకం చేపట్టిన విషయం విదితమే. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో దాదాపు పనులు పూర్తికావడంతోపాటు ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు చేరుతోంది. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి అతి సమీపంలోని మిర్యాలగూడెం అవంతీపురం వద్ద ఏర్పాటు చేసిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి నీళ్లు చేరేలా రూపకల్పన చేశారు. తక్కువ దూరం ఉన్నప్పటికీ అక్కడ మాత్రం ప్రజల దాహర్తి తీర్చాలనే ఆలోచన లేని వారు ఉండడంతో పనులు నత్తనడకన కొనసాగడంతో మంత్రి జగదీష్‌రెడ్డి చొరవ తీసుకొని అధికారులు, కాంట్రాక్టర్ల పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించడంతో ఆలస్యంగానైనా ఇటీవలే హుజూర్‌నగర్‌కు కూడా భగీరథ నీళ్లు చేరుకున్నాయి.

విపక్ష ఎమ్మెల్యే అయినా ఫుల్‌గా నిధులు, నీళ్లు
హుజూర్‌నగర్ నియోజకవర్గానికి విపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మంత్రి జగదీష్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రావడంతోపాటు అక్కడి పాలకులు ఏమాత్రం పట్టింపు చూపకున్నా హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలతో పాటు 217 గ్రామాలకు భగీరథ నీళ్లు చేరుకున్నాయి. నియోజకవర్గానికి నా అనేవారి నిర్లక్ష్యంతో అక్కడ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. భగీరథ అయితే అసలు ప్రజలకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారు. అయినప్పటికీ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రజల పక్షాన ఉంటుండడంతో అధికారులు పనులు చేపడుతూ వస్తున్నారు. అంతే కాకుండా మంత్రి చొరవతో గతంలో హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు విడుదల కాగా ఇటీవలే నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.10 కోట్లు విడుదలైన విషయం విదితమే. వీటితో పాటు మంత్రి ఆదేశాలతో కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ నిరంతర సమీక్షలు, పర్యవేక్షణతో భగరథ పనులు వేగిరం చేసి నియోజకవర్గానికి స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందిస్తున్నారు. నియోజకవర్గంలో గతంలో ఉన్న దొండపహాడ్, కిష్టాపురం, మఠంపల్లి ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు భగీరథ నిధులు వెచ్చించి వాటిని అప్‌గ్రేడ్ చేశారు. దీంతో దొండపాడు ద్వారా 21 గ్రామాలకు నీరు చేరుతుండగా కిష్టాపురం నుంచి 13, మఠంపల్లి ప్లాంట్ నుంచి 79 గ్రామాలు, అవంతీపురం నుంచి 104 గ్రామాలకు నీరు చేరుతోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నీటి కోసం ఇబ్బంది ఉండేది
మిషన్ భగీరథ నీళ్లు రాకముందు నీటి కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేంది. నీళ్ల కోసం అర్ధరాత్రి బోర్ల వద్ద క్యూలో నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో నల్లాల ద్వారా భగీరథ నీళ్లు వస్తుండటంతో ఇప్పుడు క్యూ కట్టాల్సిన పని లేకుండా ఇంటిలోనే స్వచ్ఛమైన నీరు లభిస్తుంది.
- ఆవుల జానకమ్మ(రాజీవ్‌నగర్, నేరేడుచర్ల)

సమస్య చాలా వరకు తీరింది
హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి గతంలో బేతవోలు చెరువు, కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసేవారు. నీరు స్వచ్ఛంగా ఉండేది కాదు. ప్రస్తుతం హుజూర్‌నగర్‌లోని చాలా వార్డులకు మిషన్ భగీరథ నీటిని ఉదయం, సాయంత్రం వదులుతున్నారు. చాలా వరకు నీటి సమస్య తీరింది. మిగతా ప్రాంతాల్లో పనులు నడుస్తున్నాయి. పనులు పూర్తయితే మున్సిపాలిటీల మంచి నీటి సమస్య పూర్తిగా తొలగిపోనుంది.
-గెల్లి రవి(హుజూర్‌నగర్)

త్వరలోనే వంద శాతం పూర్తి చేస్తాం
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే వంద శాతం గ్రామాలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తాం. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని 227 గ్రామాలకు గాను 217 గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
-మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లు

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...