ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవం


Tue,August 20, 2019 01:53 AM

-ధ్రువీకరణపత్రం అందజేసిన శాసనసభ కార్యదర్శి
-మంత్రి జగదీష్‌రెడ్డి, పలువురు నేతల అభినందనలు
- ఈనెల 26న ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణ స్వీకారం

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా నల్లగొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వేటుపడిన సంగతి తెలిసిందే. 2021 జూన్ 3వరకు పదవీకాలం ఉన్నందున.. ఆ స్థానం కోసం జరిగిన ఉపఎన్నికలో మాజీ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈనెల 14వరకు నామినేషన్లు స్వీకరించగా.. గుత్తా మినహా ఇతరులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. 16న నామినేషన్లు పరిశీలించిన అనంతరం.. సోమవారం అధికారికంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ధ్రువీకరణపత్రం అందజేశారు. ఈనెల 26న గుత్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, పార్టీ నేతలు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, నిరంజన్ వలీ, పాశం రాంరెడ్డి తదితరులు గుత్తాను అభినందించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల వార్డు సభ్యుడిగా మొదలైన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. 1999, 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. తొలిసారి రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీగా తన ఎన్నికకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన గుత్తా.. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...