యాదాద్రి అభివృద్ధి పనులు ఇక వేగిరం


Mon,August 19, 2019 02:55 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి నమస్తేతెలంగాణ: కొండకు ఉత్తరభాగంలో ఎంతో విలువైన భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టర్ అనితారామచంద్రన్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. భూసేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ 9 నెలల క్రితమే పూర్తిచేశారు. నిధులు విడుదల చేసే సమయానికి ఎన్నికలు రావడంతో 173ఎకరాల భూమికి సంబంధించిన పరిహారాన్ని ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది. కలెక్టర్ అనితారామచంద్రన్ సీఎం గతంలోనే విన్నవించుకోగా రూ.70కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. దీంతో ఉత్తరభాగంలో ఆలయ కిందివైపు గల 30ఎకరాలు గండి చెరువును అభివృద్ధి చేయడంతోపాటు భూసేకరణ రైతులకు నష్టపరిహారం అందించనున్నారు.

మరిన్ని నిధులు విడుదల
ఆలయ అభివృద్ధికి రూ.54కోట్ల విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైటీడీఏ ప్రతిపాదన మేర మరో రూ.470 కోట్లను పక్షం రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. సివిల్ నిర్మాణ పనుల పర్యవేక్షణ సరిగాలేదని, ఆలయ పనులు సత్వరమే పూర్తి చేయడానికి ఆర్‌అండ్‌బీ సీఈ మోహన్ నాయక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు ఇది తీపి కబురు..
పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఎంతో తీపికబురు. ఇప్పటికే సేకరించిన భూములు ఎప్పుడు స్వాధీనం చేస్తారా మా శాఖల పనులు ఎప్పుడు ప్రారంభించాలా అనే విషయంపై దృష్టిసారించిన వివిధ శాఖల అధికారులు పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా మరో రూ.54 కోట్లు విడుదల చేయడంతో రింగురోడ్డు, గండి చెరువు, రోడ్డు విస్తరణలో నష్టపోయే రైతులకు సత్వరమే నగదును అందిచనున్నారు.

రూ.400 కోట్ల విరాళాలు..!
అన్నదాన సత్రాల కోసం దాత అనందరాజ్ రూ.10 కోట్ల విరాళం అందజేయడంతో సత్రం నిర్మాణ పనులను చేపట్టారు. టెంపుల్ సిటీలో రెండువందల యాబై కార్టేజీలు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్ల విరాళాలు ఇచ్చేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలు, దాతాలు సిద్ధంగా ఉన్నారు. కార్టేజీల డిజైన్లను రూపొందించి, నిర్మాణం పనులు ప్రారంభించునున్నారు.
అధునాతన పద్దతిలో కారు పార్కింగ్..
ఉత్తరభాగంలో కారుపార్కింగ్‌కు వైటీడీఏ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు. 3000నుంచి 5000 వాహనాలు పార్క్ చేసేందుకు అవసరమైన ప్లాన్‌ను సిద్దం చేశారు. కా రు పార్కింగ్ నుంచి నేరుగా బస్‌స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి సుళువుగా కొండపైకి చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అన్నదానం కోసం భారీ సత్రం నిర్మాణం..
యాదాద్రిలో అధునాతన పద్దతిలో భారీసత్రం నిర్మాణం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అత్యంత ప్రాధాన్యత గలిగిన నిర్మాణాలన్ని కొండకు ఉత్తరం వైపుకు వస్తుండడంతో ఆ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడనుంది.
గండిచెరువులో తెప్పోత్సవం..
యాదగిరిపల్లిలోని గండిచెరువులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేందుకు అనువైన ప్రాంతంగా సీఎం కేసీఆర్ గతంలోనే గుర్తించిన నేపథ్యంలో భూసేకరణలో జాప్యం జరిగింది. అయితే తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ వచ్చి, గండిచెరువును సందర్శించారు. దీంతో గండిచెరువులోని నీళ్లు నింపేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈచెరువును నింపేందుకు అనువుగా కాలువను నిర్మించనున్నారు.

మైసూర్ బృందా వన్ గార్డెన్..
కాళేశ్వరంలో భాగంగా నిర్మించనున్న బస్వాపూర్ రిజర్వాయర్‌కు మహర్ధశ పట్టుకున్నది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఆహ్లాదకరమైన ప్రాంతంగా బస్వాపూర్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత బస్సుల ద్వారా భక్తులను గుట్టపైకి చేర్చనున్నారు.
యాదాద్రికి నేరుగా కాళేశ్వరం జలాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కావాల్సిన నీటి లభ్యతకోసం నేరుగా జలాలు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిచాల్సిందిగా అధికారులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పైపులైన్ల ఏర్పాటు చేయాలని ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు.
ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం..
ఫిబ్రవరి నెలలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు పన్నుల్లో వేగం పెంచారు. మూడువేల మంది రుత్వికులు, మూడువేల మంది వేదపారాయణ దారులు, మరో మూడు వేలమంది సహాయకులు ఇందులో పాల్గొంటారు. ఒకవెయ్యి నలబైఎనిమిది కుండాలు ఏర్పాటుచేసి యాగం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నలు, ఇతర ప్రముఖులు, నలబైఐదు దేశాల నుంచి వేధపండితులు, అర్చకులు, దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

ఇప్పటికే రూ.692 కోట్ల వ్యయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ.235 కోట్లు, రహదారుల నిర్వహణ కోసం భూసేకరణ జరిపేందుకు రూ.109కోట్లు, టెంపుల్‌సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.103కోట్ల వ్యయం ఖర్చు చేశారు. ఆలయాభివృద్ధి, యాదగిరిగుట్ట మున్సిపల్ అభివృద్ధి, టెంపుల్‌సిటీ నిర్మాణం, దేవాలయ నిర్మాణం, భక్తుల ఏర్పాట్లు తదితర పనులకు ఇప్పటివరకు రూ.692కోట్లు ఖర్చు చేశారు.
ఊపందుకోనున్న పర్యాటకం..
యాదాద్రి దేవాలయ పునరుద్దరణ పనుల పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యాటకంపై దృష్టిసారించి మాట్లాడారు. యాదాద్రి కేంద్రంగా పర్యాటకం ఊపందుకుంటుందని ఆశలు చిగురిస్తున్నాయి. యాదాద్రి-కొలనుపాక సోమేశ్వరాలయం ఇతర దేవాలయాలు కలుపుతూ టూరిజం ప్యాకేజీలు రావాలని కోరుకున్నవారి కోర్కెలు నెరవేరనున్నాయి. భువనగిరి ఖిల్లా, కొలనుపాక, జైన మందిరం, యాదాద్రి ఆలయాలను అనుసంధానం చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రకటనతో టూరిజం ప్యాకేజీలు రానున్నాయని స్పష్టమవుతున్నది. గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులను పూర్తి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో చుట్టపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles