సంచార జాతులకు సర్కార్ చేయూత


Mon,August 19, 2019 02:53 AM

- నిరుద్యోగ యువతకు ఈ-ఆటోలు
- జీవనోపాధి కల్పించడమే ధ్యేయంగా కార్యాచరణ
- 60శాతం సబ్సిడీపై అందజేసేందుకు చర్యలు
- యాత్రా స్థలాల్లో నడుపుకునేలా ప్రణాళిక
- ఈనెల 23వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం
నీలగిరి : సంచారజాతులకు రాష్ట్ర సర్కారు చేయూతనందిస్తోంది. వారిని ఆదుకునేందుకు కొత్త పథకాన్ని అమలుచేస్తున్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కార్యచరనను రూపొందించింది. 60శాతం సబ్సిడీపై ఈ-ఆటో(బ్యాటరీతో నడిచేది)లను అందించేందుకు చర్యలు చేపట్టింది. రెండులక్షల లోపు వార్షిక ఆదాయం, డ్రైవింగ్ లైసన్స్ ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిచింది. brtop.telangana.gov.in వైబ్‌సైట్‌లో ఈనెల 23వరకు గడువు విధించింది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నది. దీంతో అన్నిజిల్లాలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 30సంచార జాతుల కుటుంబాలతోపాటు అనాథలుసైతం వినియోగించుకునేలా వీలు కల్పించింది. యాత్ర స్థలాల్లో ఈ-ఆటోలు తిప్పేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం పానగల్, చెర్వుగట్టు ఆలయాలు, నాగార్జున సాగర్ పర్యటక ప్రదేశాలను అనువైనవిగా గుర్తించింది.
బ్యాటరీ వాహనాల పంపిణీకి రంగం సిద్ధం...
గత సంవత్సరం ప్రభుత్వం 8జిల్లాల్లో ఈ పథకం అమలుచేసి మంచి ఫలితాలు సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచార జాతులకు ఈ-ఆటోలను అందించగా ఆయా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలోని బీసీ కులాలల్లో సంచార జాతుల నుంచి నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. జిల్లాలోని చెర్వుగట్టు గుట్టపైకి ఈ ఆటోలతో భక్తులను చేరవేసేలా వారికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు...
ప్రభుత్వం సంచార జాతులకు అందించే ఈ-ఆటోలు బ్యాటరీతో నడుస్తాయి. ఒకసారి విద్యుత్‌తో చార్జింగ్ చేస్తే 130 నుండి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. ఏడుగురు కూర్చునేలా ఆటోలో సిటింగ్ తయారుచేశారు. ఈ-ఆటో ధర 2.50లక్షలు కాగా ఇందులో ప్రభుత్వం 60శాతం సబ్సిడీ ఇస్తుండగా 40శాతం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ-ఆటో నుండి పొగరాకపోవడంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదు. ధ్వని కాలుష్యం కూడా ఉండదు.
వీరు అర్హులు..
బీసీకులానికి చెందిన 30సంచార జాతులు జిల్లాలో ఉన్నాయి. 1.కాకిపడగల, 2.మందెచ్చుల, 3.సన్నాయోల్లు/బత్తిన, 4.కుల్ల కడగి, 5.బైల్ కమ్మర, 6.బాగోతుల, 7.బొప్పుల, 8.తోలుబొమ్మలాటవాళ్లు, 9.గంజికూటివారు, 10.శ్రీక్షత్రియ రామజోగి, 11.ఏసూటి, 12.గుర్రపువారు, 13.అద్దపువారు, 14.కడారి సైదరోళ్లు, 15.సరగాని, 16.ఓడ్, 17.మాసయ్యలు/పటంవారు, 18.సాధనాశూరులు, 19.రుంజ, 20.పాపల, 21.పనస, 22.పెక్కర, 23.పాండవులవారు, 24.గౌడ జెట్టి, 25.ఆదికొడుకులు, 26.తెర చీరలు, 27.సారోళ్ల, 28.అరవ కోమటి, 29. అహీర్ యాదవ్, 30.గొవిలి సంచార జాతులు ఉన్నాయి. వీరుకాక అన్నిరకాల అనాధలు కూడా ఈ పథకంలో అర్హులు.

ఎలాంటి పరిమితి లేదు...
సంచార జాతుల-ఆటోలు పొందడానికి పరిమితి లేదు. ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హులందరికి ప్రభుత్వం సబ్సిడీపై ఆటోలను అందిస్తుంది. జిల్లాలో ఉన్న సంచార జాతుల నిరుద్యోగ యువత ఈనెల 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు సంచార జాతులకు చెందిన వారని తహసీల్దార్‌తో ధ్రువీకరణ పత్రం, దారిద్య్ర దిగువనున్న సర్టిఫికెట్(పట్టణ ప్రాంతం వారు 2లక్షలు, గ్రామీణ ప్రాంతం వారు 1.5 లక్షలు ఆదాయ ధ్రువీకరణ పత్రం), డ్రైవింగ్ లైసన్స్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- వి. విమల, బీసీ సంక్షేమశాఖ అధికారి నల్గొండ

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...