పట్టణంలో ఓటేద్దాం


Mon,July 22, 2019 01:48 AM


-ఓటుహక్కుకు మరో అవకాశం కల్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
-పుర నోటిఫికేషన్ వచ్చేవరకు నమోదుకు అవకాశం
-పల్లె ఓటర్లపై ఆశావహుల గురి
-ఎన్నికల నాటికి భారీగా పెరగనున్న ఓటర్లు
దేవరకొండ, నమస్తేతెలంగాణ : జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, హాలియా, చిట్యాల, నందికొండ పురపాలికలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం వేగవంతంగా ఏర్పాట్లు చేస్తోంది. వార్డుల పునర్విభజన అనంతరం ఈనెల 16న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల తుది ముసాయిదా జాబితాను విడుదల చేసిన అధికారులు ఆదివారం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు, లొకేషన్లను ప్రకటించారు. ఓ వైపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా... మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి.
మరో అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం
ఓటుహక్కు పొందేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. పట్టణాల్లో ఓటు గల్లంతైన వారితోపాటు ఓటు లేని వయోజనులంతా ఈ అవకాశంతో నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. పురపాలికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. పురపాలికల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. పార్లమెంటు ఎన్నికల ఓటర్ల జాబితాను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన చేపట్టిన అధికారులు ఆ ఓటర్ల ఆధారంగానే వార్డులు పునర్విభజన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే కొత్తగా నమోదు చేసుకునే ఓటర్లకు సైతం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.
18 ఏళ్లు నిండిన వారికి అవకాశం
ఓటరు నమోదుకు మరో అవకాశం కల్పించడంతో 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదుకాని వారు.. పేర్లు తొలగింపునకు గురైనవారు.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంటుంది. వార్డుల విభజన జరగడంతో ఒక ఇంటి నంబర్ మరో వార్డులోకి వెళ్లినా.. ప్రస్తుతమున్న వార్డులోకి మార్చుకునే అవకాశం కల్పించనున్నారు.ప్రస్తుత పునర్విభజనతో ఓటర్లు తారుమారయ్యారు. ఒకవార్డు నుంచి మరో వార్డులోకి మారిపోయారు. అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పోలింగ్‌కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి ఓట్లు తారుమారయ్యాయి. కొందరి పేర్లు జాబితాల్లోనే కన్పించకుండా పోయాయి. ఇలాంటి వాటిని ఇచ్చిన గడువులోపుగా మార్చుకునేందుకు వీలు కల్పించారు.
ఆన్‌లైన్‌లో ఇలా...
అర్హులైన వారు ఎవరైనా ఇంకా ఓటరుగా నమోదు కాకపోతే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. www.ceo.telangana అనే వెబ్‌సైట్‌లో ఫారం-6, ఎన్నారైలు ఫారం-6ఏలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ఫారం-7, తప్పులు సరి చేసుకునేందుకు ఫారం-8, ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక కేంద్రానికి పేర్లు మార్చుకునేందుకు ఫారం-8ఏను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కాకుంటే స్థానికంగా ఉండే తహసీల్దార్ కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుసంధాన జాబితాలో కొత్త ఓటర్లు
ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పున ఎన్నికలకు సంబంధించి మాత్రం నోటిఫికేషన్ వచ్చేంతవరకు పేరు నమోదు చేసుకుంటే.. ఏ వార్డుకు చెందిన వారిని అక్కడి ఓటరు జాబితాకు అదనంగా అనుసంధాన జాబితాలో చేరుస్తారు.
కొత్త ఓటు నమోదుపై ఆశావహుల దృష్టి
వార్డులో పరిమితంగా ఓట్లు ఉండటం.. స్వల్ప తేడాతోనే గెలుపోటములు ఆధారపడి ఉండటంతో ఆశావహులు గ్రామీణ ప్రాంతఓటర్లపై గురిపెట్టారు. పురపాలికల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేసే ఆశావహులు వారికి అనుకూలమైన వారి పేర్లను ఓటర్లుగా నమోదుచేసే పనిలో నిమగ్నమయ్యారు. పిల్లల విద్యాభ్యాసం, ఇతర పనుల కోసం గ్రామీణప్రాంతాల నుంచి వచ్చి పట్టణాల్లో నివాసం ఉండేవారిపై నేతలు దృష్టిపెట్టారు. ఇలాంటి వారు తమపరిధిలో ఎంతమంది ఉన్నారోనని గుర్తిస్తున్నారు. 18ఏళ్లు నిండి ఇంకా ఓటరుగా నమోదుకాని వారినుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మొన్నటి ఎమ్మెల్యే, ఎంపీ, స్థానికసంస్థల ఎన్నికల్లో ఓటువేసిన వారంతా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఊర్లో ఉన్న తమ ఓట్లు తీయించేసుకుని మరీ పట్టణాల్లో నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల నాటికి వార్డుల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్లకంటే అదనంగా 5- 10 శాతం ఓటర్లు పెరిగే అవకాశం ఉంది.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...