దేవరకొండలో భారీ వర్షం


Sat,July 20, 2019 06:15 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ/చందంపేట : జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండుగంటల పాటు వర్షం కురవడంతో దేవరకొండ పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలు జలమయమయ్యాయి. దేవరకొండ పట్ణణ శివారులోని మైనంపల్లి, తాటికోల్ వాగులు పొంగిపొర్లాయి. పరిసరప్రాంత ప్రజలు వాగుల్లోకి దిగి సరదాగా గడిపారు. వాగు వద్ద సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దేవరకొండ మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలోని రెండు కుంటలు తెగిపోయాయి. దీంతో దేవరకొండ మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహించించింది. అడుగుమేర నీరు ప్రవహించడంతో కొండభీమనపల్లి బ్రిడ్జి వద్ద వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా చందంపేట మండలంలో మిషన్‌కాకతీయ చెరువులు, కుంటలు నిండాయి. గాగిళ్ళాపురం, పోలేపల్లి, బండమీది తండా, కాట్రావత్ తండా, చిత్రియాల, పెద్దమూల, తెల్‌దేవర్‌పల్లి, రేకులగడ్డ, యాపలపాయ తండా, ముడుదండ్ల, మురుపునూతల గ్రామాలతోపాటు నేరెడుగొమ్ము మండలంలోని కొత్తపల్లి, తిమ్మాపురం, పెద్దమునిగల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు ప్రారంభమైన వర్షం ఉదయం 5గంటల వరకు మూడుగంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కుంటలు, చెరువులు నిండాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వర్షాలతో కుంటలు, చెరువులు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాగిళ్ళాపురంలో ఊటకుంట చెరవు నిండింది. అదేవిధంగా వెంకట్ తండాలో బండ చెరువు పూర్తిగా నిండింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు వేసిన పంటలకు సరైన సమయంలో వర్షాలు కురవడంతో రైతన్నలు ఎరువులు చల్లే పనిలో నిమగ్నమవుతున్నారు. మరో వారంరోజులపాటు వర్షం లేకుంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్న సమయంలోనే వర్షాలు కురిసి రైతుల ముఖాల్లో ఆనందం నింపాయి.

ముదిగొండ వాగులో వృద్ధురాలు గల్లంతు
దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన మతిస్థిమితంలేని ముడిగె సాలమ్మ(75) అనే వృద్ధురాలు ముదిగొండ వాగులో శుక్రవారం గల్లంతైంది. వాగులోకి దిగిన వృద్ధురాలు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ ఘటనస్థలాన్ని పరిశీలించారు. గురువారం రాత్రి దాదాపుగా 65మిల్లిమీటర్ల వర్షపాతం కురిసిందని, దీంతో చెరువులు, కుంటలు నిండాయని తెలిపారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...