ఆశలన్నీ వరదపైనే..


Thu,July 18, 2019 04:29 AM

- ఆల్మట్టి రిజర్వాయర్‌ను క్రమంగా నింపుతున్న కృష్ణమ్మ
- ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆల్మట్టికి 90టీఎంసీల నీరు
- కొనసాగుతున్న 50వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
- నారాయణపూర్, జూరాల, శ్రీశైలం నిండితేనే సాగర్‌కు
- 507అడుగులకు చేరిన నాగార్జున సాగర్ నీటిమట్టం

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కృష్ణా ప్రవాహం పోటెత్తుతుందా? నాగార్జున సాగరం నిండుతుందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రైతాంగంలో కనిపిస్తున్న ఆందోళనంతా దీని గురించే. ప్రస్తుతానికి ఎగువన కర్ణాటకలో పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉన్నా.. సాగర్‌ను కృష్ణా ప్రవాహం చేరేందుకు మాత్రం మరింత వీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణా నదిలో ఎగువ నుంచి కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సగటున 50వేల క్యూసెక్కుల నీరు వరదరూపంలో చేరుతోంది. గరిష్టంగా 129.72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఆల్మట్టిలో ప్రస్తుతం 108టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆల్మట్టికి 90టీఎంసీలకు పైగా నీరు వరద రూపంలో చేరింది. ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయిలో నిండటానికి ఇంకా 22టీఎంసీల నీరు కావాల్సి ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తే అవకాశం ఉందన్న అంచనాతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రస్తుతం ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌కు 20వేల క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు.

ఎగువన అన్నీ నిండితేనే సాగర్‌కు వరద...
ఆల్మట్టికి దిగువన నారాయణపూర్‌కు ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతోంది. 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 31.31టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయిలో నిండటానికి ఇంకో 6టీఎంసీల నీరు అవసరం ఉంది. నారాయణపూర్ దిగువన ఉన్న జూరాల జలాశయం నీటి సామర్థ్యం 9.66టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.89 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. మరోవైపు కృష్ణా ఉపనది తుంగభద్రలోనూ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయానికి 10వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. 885అడుగుల నీటి మట్టం కలిగిన శ్రీశైలంలో ప్రస్తుతం కేవలం 805అడుగుల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. గరిష్టంగా 215.81టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఇక్కడ కేవలం 31.53టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. సాగర్‌లోనూ పరిస్థితి శ్రీశైలం కంటే పాతాళానికి చేరింది. 312.05టీఎంసీల సామర్థ్యం (590 అడుగులు) కలిగిన నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం కేవలం 126.47 టీఎంసీల (507 అడుగులు) నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువన వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగితే పైన ఉన్న అన్ని జలాశయాలు నిండి.. సాగర్‌కు కృష్ణా నీటి ప్రవాహం చేరడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందనే అంచనా ఉంది. ఒకవేళ వరద ప్రవాహం అంతంత మాత్రంగానే కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ చేరడానికి సెప్టెంబర్ వరకూ ఆగక తప్పదేమో.

సాగర్ నీటిమట్టం @ 506.90 అడుగులు
నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590అడుగులకు గాను 506.90అడుగుల వద్ద 126.4667 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదల కొనసాగడం లేదు, సాగర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కులు, డీటి గేట్సు(డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కులు మొత్తం 810 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఎడమకాల్వ ద్వారా, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా, కుడికాల్వ ద్వారా నుండి నీటి విడుదల లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 805.00 అడుగుల వద్ద 31.5280 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...