వర్షం రైతన్నల హర్షం


Wed,July 17, 2019 04:21 AM


నిడమనూరులో జోరువాన పలు మండలాల్లో మోస్తరుగా..
రామగిరి : రుతుపవనాల ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలుప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అంతటా ఆకాశం మేఘవృతమై జల్లులు పడగా పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అడవిదేవులపల్లి, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. నిడమనూరు మండలకేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో జోరువాన పడింది. అదేవిధంగా కట్టంగూర్, నార్కట్‌పల్లి, హాలియా, త్రిపురారం, చిట్యాల మండలాల్లో సైతం వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది.
మర్రిగూడలో... : విత్తనాలు నాటి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో మంగళవారం కురిసిన వర్షం ఆశలు చిగురించేలా చేసింది. సరైన వర్షం కురవకపోవడంతో ఇప్పటికీ దుక్కులు విత్తనాలు నాటకుండా దర్శనం ఇవ్వడమే కాకుండా నాటిన పత్తి గింజలు భూమిలోనే ఉండిపోయాయి. తాజా వర్షంతో పత్తిచేలకు ప్రాణం పోసినట్లుకాగా వ్యవసాయ పనులు ముమ్మరం కానున్నాయి. జులై నెలం సగం ముగిసిన వర్షం కురవకపోవడంతో దిగాలు చెందుతున్న రైతన్న ముఖంలో అనందాన్ని నింపాయి.
నాంపల్లిలో... : నాంపల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామల్లో మంగళవారం వర్షం కురిసింది. రైతులు గత కొద్దిరోజులుగా వర్షం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కురిసిన వర్షంతో రైతులు ఆనందంలో ఉన్నారు. కురిసిన వర్షంతో ఉపిరిపీల్చుకున్నారు. విత్తనాలను నాటడానికి సిద్ధపడుతున్నారు.
కట్టంగూర్‌లో... : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా మోస్తారు వర్షం పడుతుండడం వల్ల వీధుల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు ప్రాంతాల్లో వర్షపు నీరంత రహదారిపై నిల్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోస్తారు వర్షం కురుస్తుండడడంతో పత్తి, కంది ఇతర మెంట పంటలు సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అడవిదేవులపల్లిలో... : మండలంలో మంగళవారం కురిసిన వర్షంతో పత్తి రైతులకు కొంత ఊరట లభింంచింది. గత నెలరోజులుగా వానలు పడక రైతులు ప్రజలు అల్లాడుతున్నారు. మండలంలోని అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, మొల్కచర్ల, బాల్నేంపల్లి గ్రామాల్లో అధికంగా పత్తి విత్తనాలు నాటారు. మొదటగా నాటిన పత్తి మొక్కలు వానలు లేక వాడిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. వానలు పడాలని పలు గ్రామాల్లో నిర్వహించిన పూజలు ఫలించాయి.
త్రిపురారంలో... : మండలంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుండి మబ్బుల ఎండతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం పొందారు.
నిడమనూరులో జోరు వాన
నిడమనూరు : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం జోరువాన కురిసింది. మృగశిర కార్తె ప్రవేశం అనంతరం ఇప్పటివరకు మండలంలో వర్షం జాడలేదు.. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా జనం విలవిల్లాడుతున్నారు. మృగశిర కార్తె ప్రవేశం అనంతరం వర్షం జాడ లేకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షం కురవని కారణంగా వ్యవసాయ పనులు ప్రారంభంకాలేదు. కాగా మంగళవారం ఎండ తీవ్రస్థాయిలో కాసినప్పటికీ సాయంత్రం సమయంలో వాతావరణం మేఘావృతమై ఉన్నట్లుండి ఒక్కసారిగా జోరు వాన కురవడంతో వర్షపు నీరు రహదారులపై నుండి ప్రవహించింది. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో, ప్రధాన రహదారుల వెంట వర్షపు నీరు నిలిచింది. వేసవిని తలపించే రీతిలో కాస్తున్న ఎండల నేపథ్యంలో మంగళవారం జోరు వానతో ప్రజలు ఊరట చెందారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...