వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి


Tue,July 16, 2019 05:11 AM

నీలగిరి: చిన్న రాష్ట్రం.. కొత్త రాష్ట్రం.. అతి తక్కువ కాలంలో మంచి పథకాలు రూపొందించుకుని.. ఫలితాలు రాబట్టుకుని దేశ చిత్ర పటంలో తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సముచిత స్థానం దక్కించుకోవడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య శాఖ, వైద్య విధాన పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంపై అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వదవాఖానలు, మౌలిక వసతుల కల్పన, డాక్టర్ల నియామకం చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోగం కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కేవలం ఓట్ల కోసం కాకుండా ప్రజలు కేంద్రీకృత పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. మానవీయ కోణంలో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. వైద్య రంగంలో సూచికలు ఆరోగ్యవంతమైన రాష్ట్రానికి, దేశానికి గీటురాయి అని తెలిపారు. తమిళనాడు, కేరళ లాంటి అభివృద్ధ్ది చెందిన రాష్ర్టాల సరసన తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో నిలిచిందన్నారు. జిల్లాలో సాగర్ తలాపున ఉన్నా 70 ఏళ్లుగా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించలేని పరిస్థితికి నల్లగొండ జిల్లా ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో నీటి కారణంగా ఎక్కువ రోగాలు వ్యాపిస్తాయన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథను ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. తాగునీటితో పాటు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కాన్పులు చేయించుకుంటే గర్బిణులకు కేసీఆర్ కిట్ ద్వారా రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికి డాక్టర్లు చిత్తశుద్ధ్దితో పని చేయాలన్నారు. డాక్టర్లు దవాఖానకు సక్రమంగా హాజరై వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు, ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. వైద్యో నారాయణో హరి అనే నానుడి ప్రకారం డాక్టర్లను దేవుడిగా చూసే పరిస్థితి తీసుకురావాలన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ రూపొందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆరోగ్య రంగంలో జిల్లాను నెంబర్‌వన్‌గా నిలుపాలని సూచించారు.

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే వైద్య రంగంలో చాలా మార్పు వచ్చిందన్నారు. ప్రజలకు వైద్య సేవలపై విశ్వాసం పెరిగిందని మంత్రి సీఎం కేసీఆర్ పరిస్థితులను అధ్యయనం చేసి పీహెచ్‌సీల నుంచి జిల్లా కేంద్ర దవాఖానల వరకు అన్ని రకాల సౌకర్యాలు, తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఆరోగ్యం పెద్ద ఆర్థ్ధిక సమస్య అని, ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఉందన్నా రు. డాక్టర్లు బాధ్యతగా పని చేసి స్వయం పరిశీలనతో వైద్య సేవలు అందించి ప్రజలు శభాష్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. మెడికల్ కళాశాలల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందుబాటులోకి వస్తాయని అందరు కలిసి పని చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ, పైలేరియాపై అప్రమత్తంగా అధికారులు ఉండి ఎప్పటికప్పుడు వ్యాధులు సంభవించే అనార్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

కోదాడ, మిర్యాలగూడ దవాఖానలపై అసంతృప్తి
సమీక్షలో కోదాడ దవాఖానలో నెలకు 20 నుంచి 25 ప్రసవాలు, మిర్యాలగూడ ఏరియా దవాఖానలో 40 ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య విధాన పరిషత్ అధికారి రాములునాయక్ వివరిస్తుండగా వాటిపై మం త్రులు జగదీష్‌రెడ్డి, రాజేందర్‌లు కలుగజేసుకుని పెద్దాసుపత్రిలో అన్ని రకాల వసతులు ఉన్నా ఎందుకు ప్రసవాలు తక్కువగా వస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ వచ్చాక కూడా మెరుగు పడటం లేదని ప్రశ్నించారు. దవాఖానల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని సూపరింటెండెంట్‌ను నిలదీశారు. గైనకాలజిస్టులు సరిగ్గా విధులు నిర్వర్తిస్తే ఎందుకు ప్రసవలు పెరగడం లేదని ప్రశ్నించారు. డాక్టర్లు బాధ్యతగా పని చేస్తే ప్రసవాలు పెరుగుతున్నాయన్నారు. మూడు నెలల్లో ప్రగతి కనిపించాలని లేకపోతే తగు చర్యలు తప్పవని సూచించారు.

సిజేరియన్‌లో నల్లగొండ ఆగ్రస్థానం...
సాధారణ ప్రసవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుంటే అధికారులు మాత్రం అందుకనుగుణంగా పని చేయడం లేదని మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. దేశంలో సిజేరియన్లు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటే , రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం దారుణమన్నారు. జిల్లాలో సిజేరియన్లు బంద్ కావాలని, ఇందుకు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సిబ్బంది సూచించారు. ముహుర్తాలు చూసుకుని ఆపరేషన్లు చేయడం జీవితాలతో చెలగాట మాడటమే అన్నారు. ఈ విషయంలో మార్పు రాకపోతే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. రమేష్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్తు జి.శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య మౌలిక సదుపాయాల స్థానిక సంస్థ చీఫ్ ఇంజినీర్ లకా్ష్మరెడ్డి, డీఎంహెచ్‌ఓ అన్నిమల్ల కొండల్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...