వర్షాభావం..


Mon,July 15, 2019 02:28 AM

-రెండు నెలలుగా కురవని వర్షం
-సాగుపనులు ముందుకు సాగక రైతన్న దిగాలు
-పలు ప్రాంతాల్లో విత్తనాలు వేసి వాన కోసం ఎదురుచూపు
-జిల్లాలో సగం ప్రాంతాల్లో ఇంకా పడని విత్తనం
-చందంపేట మినహా అన్ని మండలాల్లో తీవ్ర దుర్భిక్షం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: నైరుతి రుతు పవనాల ప్రభావం జిల్లాలో కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు విత్తే పరిస్థితిలో రైతులు లేరు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన జల్లులకు కొంత మంది రైతులు విత్తనాలు విత్తినప్పటికీ వరుణుడు కరుణించడం లేదు. రెండు నెలలుగా వర్షం పడక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రైతాంగం ప్రదానంగా పత్తిని దృష్టిలో ఉంచుకుని విత్తనాలు వేసి వరుణుడి కోసం ఎదురు చూస్తుండగా వర్షం లేని కారణంగా అది మాడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 31 మండలాల్లో చందంపేట మినహా అన్ని మండలాల్లో కనీసం వర్షాలు పడక ఈ సీజన్‌లో కరువు ఛాయలు నెలకొన్నాయి.

వర్షం లేక....
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 730 మి.లీ. పడాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో వర్షాలు లేని కారణంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని నార్లు పోసి ఉన్న రైతాంగం వరుణుడు కరుణించని కారణంగా అటు విత్తనాలు మగ్గిపోవడంతో పాటు పోసిన నారు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలో లేరు.

విత్తనాలు వేసి ఎదురు చూపు...
జిల్లాలో 4లక్షల 30 వేల హెక్టార్ల భూములుండగా ఆయా ప్రాంతాల్లో వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని 3 లక్షల 22వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. అందులో ప్రదానంగా పత్తి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కందులు, పెసర దానితో పాటు మిగతా పంటలు రైతాంగం సాగు చేస్తున్నారు. జూన్‌ కంటే ముందు అల్ప పీడన ప్రభావం నేపథ్యంలో వర్షం కురువడంతో దుక్కులు దున్నుకుని సిద్ధ్దం చేసుకున్న రైతులు ఆతర్వాత జూన్‌లో పడినటువంటి సాధారణ వర్షానికి విత్తనాలు విత్తారు. అయితే ఆ తర్వాత వర్షం లేని కారణంగా సగం మేరకు విత్తనాలు మొలవకపోవడంతో మొలిచిన విత్తనాలు నీరు లేక ఎండిపోసాగాయి.

అన్ని మండలాల్లోనూ ...
జిల్లాలోని 31 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చందంపేట మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు పెద్దగా పడలేదు. చిట్యాలలో 152.1 మి.మీ. పడాల్సి ఉండగా 81శాతం నార్కట్‌పల్లిలో 124.4 మి.మీ. పడాల్సి ఉండగా 23 శాతం, కట్టంగూర్‌లో 149.3 మి.మీకి గాను 23 శాతం, శాలిగౌరారంలో 169.7 మి.మీ.కి గాను 54 శాతం, నకిరేకల్‌ 167.7 కి గాను 90 శాతం, కేతేపల్లిలో 150.8 మి.మీ.కి గాను 78శాతం, తిప్పర్తిలో 128.7 మి.మి.కి గాను 87 శాతం, నల్లగొండ 126.1 మి.మి.కి గాను 87 శాతం, కనగల్‌ 131.1 మి.మి.కి గాను 87 శాతం, మునుగోడులో 150.0 మి.మి.కి గాను 36 శాతం, చండూరు 151.1 మి.మి.కి గాను 36 శాతం, మర్రిగూడ 117.8 మి.మి.కి గాను 49 శాతం, చింతపల్లిలో 120.2 మి.మి.కి 86 శాతం, నాంపల్లి 114.9కి 74, గుర్రంపోడు 99.9గాను 68 శాతం, అనుముల 137.2 మి.మి.కి 82 శాతం, నిడమనూరులో 137.3 మి.మి.కి 90 శాతం. త్రిపురారం 128.3కి 85 శాతం, మాడ్గులపల్లిలో 131.2కు 70 శాతం, వేములపల్లిలో 128.5కు 92 శాతం, మిర్యాలగూడలో 131.4కు 69 , దామరచర్లలో 123.8కి 68, అడవిదేవులపల్లిలో 123.8కి 89 శాతం, తిరుమలగిరిసాగర్‌ 132.1కు 62 శాతం, పెద్దవూర 121.6కు 30 శాతం, పీఏపల్లి 96.4కు 83 శాతం, నేరేడుగొమ్ము 113.3కి 82 శాతం, కొండమల్లేపల్లి 134.1కు 44 శాతం, దేవరకొండకు 134.1 కు 44, గుండ్లపల్లి 146.5కు 60, చందంపేట 128.1 మి.మీ.కు ఉండగా అత్యధికంగా వర్షం పడటంతో 5శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జూన్‌, జూలైతో పోల్చుకుంటే 132.3 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా ఇంకా 70 శాతం లోటులో వర్షపాతం ఉంది.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...