ఆశల సాగు..


Sun,July 14, 2019 01:30 AM

- వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపు
- ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు
- భూగర్భజలాలతో వరి సాగుకు సన్నద్ధం
- సాగర్ ఆయకట్టులో బోర్లు, బావుల కింద నార్లు సిద్ధం
- తిండి గింజల కోసం వరి సాగుకే మొగ్గు

మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు రైతులు సిద్ధవుతున్నారు. బోరుబావులు, ఊటబావుల కింద వరి సాగు చేసుకునేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి మండలాల పరిధిలో 1.53లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. దీనిలో బోరుబావులు, ఊటబావుల ఆధారంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

అడుగంటిన ప్రాజెక్టు నీటి నిల్వలు
సాగర్ ఆయకట్టులో మృగశిర, ఆరుద్రకార్తెలలో రైతులు వరి విత్తనాలు చల్లుతారు. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 507 అడుగులు నీటిమట్టం మాత్రమే ఉన్నది. దీంతో ఆయకట్టుకు నీరు వదిలే పరిస్థితి లేకుండాపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో సైతం నీటి నిల్వలు అడుగంటడంతో వానాకాలం పంటలకు సాగునీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారింది. ఈ దశలో రైతులు భూగర్బజలాలపై ఆధారపడి వరి సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

బోరుబావుల కింద సేద్యానికి మొగ్గు...
ఆయకట్టుకు సాగర్ నీరు రాని పరిస్థితిలో బోరుబావులు, ఊటబావుల ద్వారా వరి సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సాగర్ డ్యాంలో నీటి నిల్వలు లేవని గ్రహించి బోరుబావులు, ఊటబావులు కింద నారు పోశారు. చాలామంది రైతులు నారుమళ్లు సైతం సిద్ధం చేసుకున్నారు.

కొత్తగా బోరుబావులు, విద్యుత్ లైన్లు
సాగర్ ఆయకట్టులో వానాకాలం పంటలకు సాగునీరు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రైతులు భూగర్బ జలాల ఆధారంగా వరి సాగు చేయాలనే లక్ష్యంతో కొత్తగా బోర్లు వేస్తున్నారు. బోర్లలో సాగుకు సరిపడా నీరు పడితే వెంటనే విద్యుత్ లైన్లు వేసి మోటార్లు బిగించుకునేందుకు డీడీలు తీస్తున్నారు. ఆయకట్టు ప్రాంతలో అధికంగా బోర్లు ఉండడంతో రైతులు ఒకరిని చూసి మరొకరు బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు అంతంతమాత్రమే ఉన్నాయి. వానాకాలం పంటలకు ఆయకట్టుకు సాగుకు నీటి విడుదల కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వానాలు ల్కే కరువును తలపించే పరిస్థితి నెలకొంది. ఆయకట్టు రైతులు మాత్రం భూగర్భ జలాల ఆధారంగా వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. స్వల్పకాలిక వరి వంగడాలు సాగు చేసేందుకు నారుమళ్లు సైతం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నీటి వసతి ఆధారంగా పంటలు వేసుకోవాలి
ప్రస్తుతం తీవ్ర వర్షాబావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు బోరుబావులు, ఊటబావులు కింద నీటి లభ్యతను బట్టి వరి సాగు చేయాలి. మెట్ట పంట లు అయితే తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు స్వల్పకాలిక వరి వంగడాలు వేసుకోవాలి. పంట త్వరగా వస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
- పోరెడ్డి నాగమణి, ఏడీఏ, మిర్యాలగూడ

బోరు కింద వరి సాగు చేస్తా
ఇప్పుడు సాగర్ కాల్వకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నాకు ఉన్న మూడెకరాల్లో వరి నారు పోసిన. బోరు నీటితో నాటువేయాలనే నిర్ణయించుకున్న. పొలం దుక్కి దున్నాలంటే కొద్దిపాటి వర్షం కోసం ఎదురు చూస్తున్నా. ఇంకో 20 రోజులు అయితే నారు పెరుగుతుంది. ఈ లోపు పొలం దుక్కి దున్ని దమ్ము చేస్తా.
- సైదానాయక్, వాటర్‌ట్యాంకుతండా, మిర్యాలగూడ

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...