అటు జోష్.. ఇటు తుస్స్..


Sun,July 14, 2019 01:27 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అధికార పార్టీలో మున్సిపాలిటీ ఎన్నికల ఉత్సాహం ఉరకలెత్తుతోంటే.. ప్రతిపక్ష పార్టీల్లో కనీస స్పందన సైతం కరువైంది. ఉమ్మడి జిల్లా అంతటా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఎన్నికలు జరగనున్న 18మున్సిపాలిటీల్లో ప్రతి వార్డునూ పలకరిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇప్పటికే గడిచిన వారం రోజుల్లో సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, చిట్యాల, కోదాడ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. మిగిలిన స్థానాల్లోనూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం సైతం పల్లెటూళ్లకు దీటుగా పట్టణాల్లోనూ ఉత్సాహంగా సాగుతోంది. లక్ష్యానికి మించి సభ్యులు ఇప్పటికే టీఆర్‌ఎస్ సభ్యత్వాలు స్వీకరించినా.. ఇంకా కార్యక్రమం ముందుకు సాగుతూనే ఉంది. ప్రతీ వార్డులో.. ప్రతీ వీధిలో టీఆర్‌ఎస్ నేతలు సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నారు. అతి త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున.. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తిరుగులేని ఆధిక్యంతో చైర్మన్ పీఠాలను సాధించుకోవాలనే ప్రణాళికతో టీఆర్‌ఎస్ పని చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి వార్డు సభ్యులుగా, చైర్మన్లుగా పదవులు ఆశిస్తున్న వాళ్లు సైతం ఇప్పటికే తమ తమ ప్రాంతాల ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో వార్డు నుంచి నలుగురైదుగురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.

ప్రతిపక్ష పార్టీల్లో ఎన్నికల ఊసే కరువు...
ఆయా వార్డుల్లో అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారు? మున్సిపల్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికవుతారు? ఏ రిజర్వేషన్ వస్తే ఎవరికి చైర్మన్ పీఠం దక్కుతుంది? అనే అంశాలతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ శ్రేణులు నిత్యం బిజీ బిజీగా గడుపుతుంటే.. ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం ఎన్నికల సందడి ఏ మూలనా కనిపించడం లేదు. అక్కడక్కడా వార్డుల విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు మినహాయిస్తే అంతకు మించి ముఖ్య నేతల్లో ఎక్కడా మున్సిపాలిటీ పోరుపై ఉత్సాహం కనిపించడం లేదు. మొన్నటి వరకూ కౌన్సిలర్లుగా పని చేసిన ఒకరిద్దరు మినహాయిస్తే కాంగ్రెస్ సహా బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీల నుంచి ఎవ్వరూ పోటీ రేసులోనూ కనపడడం లేదు. టిక్కెట్ల కోసం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆయా పార్టీల్లో నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవ్వరూ తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో కనీసం పలకరింపులు సైతం చేపట్టడం లేదు. ముఖ్య నేతలే ముందుకు రాకపోవడంతో పూర్తిగా నీరసించిన కార్యకర్తలు.. తమ పార్టీ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసిందని చర్చించుకోవడం కనిపిస్తోంది.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...