కేసీఆర్ ఆశయ సాధనే లక్ష్యం


Thu,July 11, 2019 03:54 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తాగునీటిని అందించే బృహత్తర మిషన్ భగీరథ పథకం పక్కాగా పూర్తి చేయించడం.. హరితహారంతో ప్రతీ పల్లెను ఆకుపచ్చ వనంలా తీర్చిదిద్దడం.. రహదారులు, శ్మశాన వాటికలు, నూతన పంచాయతీ భవనాల నిర్మాణంతో సహా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూ జిల్లా పరిషత్ ముందుకు సాగుతుందని నూతన చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి చెప్తున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సభ్యుల సహకారంతో జిల్లాలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చెప్తున్న బండా.. నమస్తే తెలంగాణతో మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

పల్లెల సమగ్రాభివృద్ధే ఆశయం
రాష్ట్రంలో ప్రతీ పల్లెటూరిని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా అనుక్షణం ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ అధినేత కేసీఆర్ ఆలోచనలు సాగుతున్నాయి. వారి ఆశయానికి అనుగుణంగా పని చేస్తూ.. ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించే దిశగా కృషి చేయడమే జడ్పీ చైర్మన్‌గా నా ప్రధాన కర్తవ్యం. ప్రతీ గ్రామం ఆకుపచ్చగా.. రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఏ లోటు లేకుండా ఉండే విధంగా ప్రణాళికతో పని చేస్తాం. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో సమీక్షలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభించాం. ముందుగా నార్కెట్‌పల్లి మండలం నుంచే కార్యాచరణ మొదలు పెడుతున్నాం.

అన్ని నిధులు వినియోగించుకునే ప్రణాళిక
జిల్లా పరిషత్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటనే.. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా పల్లెల్లో చేపట్టేందుకు వీలున్న ఇంకుడు గుంతలు, రైతులకు వివిధ రకాల షెడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు వంటి వాటికి ఉపయోగించుకునే పక్కాగా ప్రణాళికతో ముందుకు సాగుతాం. మిషన్‌భగీరథలో పూర్తి కావాల్సిన పనులపై దృష్టి పెడుతూనే.. వాతావరణం అనుకూలించిన చోట హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేపడుతున్నాం. అవసరమైతే పంచాయతీ పాలకవర్గాల సహకారం సైతం తీసుకుంటాం. జడ్పీస్కూళ్లలో సౌకర్యాలు, మరమ్మతుల వంటి వాటి పైనా దృష్టి సారిస్తాం.

అంతకు మించి చేస్తానని నమ్ముతున్నా..
మా పార్టీ అధినేత, తెలంగాణ సాధకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో నాకు జడ్పీచైర్మన్‌గా అవకాశం లభించింది. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇంకా ఏడాది కాలం అవకాశం ఉన్నా.. రాష్ట్రస్థాయి పదవి వదిలి జడ్పీ చైర్మన్ అవకాశం కోరుకుంది కేవలం ప్రజలతో మమేకం కావాలని మాత్రమే. అడిగిన వెంటనే కాదనకుండా నాకు అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే నా లక్ష్యం. నా ఎంపికకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు, జడ్పీటీసీలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. నాపై వాళ్లంతా పెట్టుకున్న నమ్మకం కంటే ఇంకా కొంచెం ఎక్కువే సాధించి చూపిస్తాననే నమ్మకం నాకుంది.

అందరి సహకారంతో ముందుకు..
ఉమ్మడి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో.. నిధులను వినియోగించుకుంటూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. నూతన పంచాయతీల్లో కార్యాలయ నిర్మాణం, ప్రతీ గ్రామంలో ఇప్పటికే మంజూరైన శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయడం.. అన్ని శాఖల అధికారులు, ఇంజినీర్ల సహకారంతో నిర్ణీత కాలవ్యవధితో పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పల్లెల అభివృద్ధి కోసం పలు కొత్త చట్టాలను తెస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతున్న కేసీఆర్ పరిపాలన మాకు మార్గదర్శకంగా ముందుకు నడిపించనుంది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...