బీజేపీ భ్రమ పడుతోంది..


Mon,July 8, 2019 03:48 AM

- రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా నిరుపేదలతోపాటు తెలంగాణకు సైతం తీవ్ర నిరాశను మిగిల్చిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండలోని తన ఇంట్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు ప్రభుత్వ పథకాలకు ప్రత్యేక కేటాయింపులు లేకపోగా.. ఉన్న వాటిల్లోనే కోతలు విధించిందని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను సైతం కలిసి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగినా పట్టించుకోలేదని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సూచించినా రూపాయి కూడా ఇవ్వలేదని గుత్తా వివరించారు. అభివృద్ధిలో ఉన్న తెలంగాణను ఇబ్బందులకు గురి చేసేలా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వ పథకాల పై కోర్టుల్లో కేసులు వేయమని చెప్పడం సరికాదన్నారు. అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు సృష్టించి, అస్థిర పరిచి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భ్రమ పడుతోందని.. అలాంటి ఆటలను తెలంగాణ ప్రజలు ముందుకుసాగనివ్వరని అన్నారు.

బీజేపీకి స్థానం లేదు : బండా
కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రప్రభుత్వం.. ఆయా పథకాలను నిధులను కేటాయించకపోవడం దారుణమని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ప్రశంసించి ఇతర రాష్ర్టాల్లో అమలుచేస్తున్న మన పథకాలకు సైతం ఇక్కడ నిధులు ఇవ్వలేదని.. ఆర్థిక ఇబ్బందులు సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించి అధికారంలోకి రావాలనుకోవడం సాగదని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు : కంచర్ల
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని.. ఏకపక్షంగా టీఆర్‌ఎస్ సాధించిన ఘన విజయాన్ని బీజేపీ ఓర్వలేకపోతోందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకున్నా మూడేండ్లలోనే కాళేశ్వరం కట్టి చూపిన కేసీఆర్ ఘనత చూసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మాలె శరణ్యా రెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...