హస్తవ్యస్తం..!


Tue,June 18, 2019 02:22 AM

-బీజేపీ వైపు కాంగ్రెస్ నాయకుల చూపు ?!
-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో చర్చ
-పార్టీని వీడేది లేదంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-అన్నదమ్ముళ్ల మధ్య రాజకీయ విభేదాలంటూ ప్రచారం
-తీవ్రస్థాయి విమర్శలపైనా స్పందించని సీనియర్ నేతలు
-హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముందే చేతులెత్తేసే చాన్స్
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరు న్నారు? తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక బీజేపీ వైపు చూస్తున్న నాయకులతో ఆ పార్టీ జిల్లాలో బలపడుతుందా? ఇంతకీ కాంగ్రెస్‌లో ఎంత మంది మిగులుతారు? తమ పరిస్థితి ఏమిటి? జిల్లాలోని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య సాగుతున్న ప్రశ్నల పరంపర ఇలాగే ఉంది. కాంగ్రెస్ పనై పోయింది.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి చేరిక ఖాయమైందనే ప్రచారం ఓ వైపు సాగుతుండగా.. తాను కాంగ్రెస్‌ను వీడేదే లేదంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండడంతో.. బ్రదర్స్ మధ్య రాజకీయ వైరుధ్యం తలెత్తిందనే సందేహాన్ని సైతం లేవనెత్తుతోంది. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి స్పందించకపోవడం చూస్తుంటే.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముందే తమ పార్టీ చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు.

ఒకప్పుడు కాంగ్రెస్ ఖిల్లాగా చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి నానాటికీ మరింత తీసికట్టుగా తయారవుతోంది. గతేడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడంటే మూడు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవం మూట గట్టుకున్న వెంటనే.. ఈ ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ పోరులోనూ అదే పరాభవం ఎదురైంది. తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే 80శాతం పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో త్రుటిలో ఓటమి తప్పించుకొని స్వల్ప మెజారిటీతో బయటపడి పరువు దక్కించుకున్నా.. పరిషత్ ఎన్నికల్లో మళ్లీ ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి తప్పలేదు. నాలుగింట మూడొంతుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. ఆ బలం తాత్కాలికమేనని పరిషత్ ఎన్నికల ఫలితాలతో తేట తెల్లమైంది. మరోవైపు.. అంతకు ముందే కాంగ్రెస్‌లో గెలిచిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం అభివృద్ధికి జై కొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నారు. ఇక ఇద్దరే మిగిలిన స్థితిలో ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

హస్తం శ్రేణుల్లో అయోమయం.. జగన్నాథం..
వరుస ఓటములు ఇప్పటికే పార్టీని కుంగదీయగా.. నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందాన్ని తలపిస్తోంది. మూడ్రోజుల కిందట ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ రాష్ట్ర నాయకత్వం పని తీరును విమర్శిస్తూ.. కాంగ్రెస్ పనై పోయిందని.. బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయనతోపాటు జిల్లాలో మరికొందరు ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నారనే ప్రచారమూ సాగుతోంది. అయితే రాజగోపాల్‌రెడ్డి కంటే ముందు నుంచీ రాజకీయాల్లో ఉన్న ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడేది లేదని చెప్తుండటంతో ఇద్దరు బ్రదర్స్ మధ్య రాజకీయ విభేదాలు వచ్చాయనే చర్చకు దారి తీస్తోంది. నార్కట్‌పల్లి జడ్పీటీసీగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పోటీని రాజగోపాల్‌రెడ్డి.., స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీని వెంకటరెడ్డి వ్యతిరేకించారని.. అప్పటి నుంచే ఇద్దరి రాజకీయ విభేదాలు పొర చూపాయని ప్రచారంలో ఉంది.

స్పందించని సీనియర్లు.. పక్క చూపుల్లో ఇతర నేతలు...
రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఉమ్మడి జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు మాజీ సీఎల్పీ నేత అయిన కుందూరు జానారెడ్డి సైతం ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఇది వ్యూహాత్మక మౌనమని కాంగ్రెస్ శ్రేణులుపైకి తమాయించుకుంటున్నా.. అంతకు మించి చేసేదేమీ లేదని లోలోపల గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే అగమ్యగోచరంగా తయారైన పార్టీ పరిస్థితి.. తాజా ఎపిసోడ్‌తోపాటు జరుగుతున్న పార్టీ మార్పిడిల ప్రచారంతో మరింత దయనీయంగా తయారైంది. అక్కడక్కడా ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజులూ కాంగ్రెస్‌లో మిగిలిన ఇతర ద్వితీయ శ్రేణి ముఖ్య నేతలు సైతం తాజా పరిణామాలతో బీజేపీలోకి వెళ్లలేక, కాంగ్రెస్‌లో ఇమడలేక.. టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతోనూ పలువురు సంప్రదింపులు జరుపుతున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ బలహీనతను బాహాటంగా చాటుతున్నాయి. ఎన్నికకు ముందే అనధికారికంగా పరాజయం అంగీకరించే పరిస్థితి తమ పార్టీలో నెలకొందని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతుండడం కొసమెరుపు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...