టీఆర్‌ఎస్‌ 23/31


Sun,June 16, 2019 02:51 AM

-జిల్లాలో 23మండల పరిషత్‌లపై గులాబీ రెపరెపలు
-నేరేడుగొమ్ము, కేతేపల్లి ఎంపీపీలూ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే
-ఎన్నికైన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరిన కేతేపల్లి ఎంపీపీ
-వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ నాయకులు
-కాంగ్రెస్‌కు చందంపేట స్థానం.. 8ఎంపీపీలు హస్తగతం
-పరిషత్‌ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం చూపిన టీఆర్‌ఎస్‌
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని 31మండలాలకు 24జడ్పీటీసీ స్థానాల్లో విజయం. 23మండల పరిషత్‌ స్థానాలు సైతం కైవసం.. పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రీతిలో ప్రదర్శించిన ఆధిక్యత ఇది. జిల్లా పరిషత్‌ పీఠం మాదేనంటూ.. ఎక్కువ ఎంపీపీ స్థానాలు సైతం కైవసం చేసుకుంటామంటూ బీరాలు పలికిన కాంగ్రెస్‌కు మిగిలింది 8 ఎంపీపీ, 7జడ్పీటీసీ స్థానాలు మాత్రమే. జిల్లాలోని మొత్తం 349ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 191చోట్ల ఘన విజయం సాధించగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు 134స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. సొంతంగా 18చోట్ల ఆధిక్యత తెచ్చుకున్న టీఆర్‌ఎస్‌.. మిగిలిన 5స్థానాల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌, స్వతంత్ర అభ్యర్థుల సాయంతో ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుంది. సొంతంగా ఆరు స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ కూడా మరో రెండు స్థానాలు స్వతంత్ర అభ్యర్థుల సాయంతో దక్కించుకుంది. ఈ నెల 7న జిల్లాలోని 28మండలాల్లో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మిగిలిన కేతేపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లో తర్వాతి రోజు కూడా ఎన్నిక వాయిదా పడింది. సరైన సమయంలో కో ఆ ప్షన్‌ సభ్యులు నామినేషన్‌ వేయకపోవడంతోపాటు.. ఎంపీపీ అభ్యర్థులు సైతం నామినేషన్‌ వేయడం ఆలస్యం కావడం వంటి కారణాలతో ఆరోజు వాయిదా పడ్డ ఎన్నికలు శనివారం నిర్వహించారు.

వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌...
మూడు మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చందంపేట మండలంలో మొత్తం 9 మంది సభ్యులకు కాంగ్రెస్‌ 5 స్థానాలు, టీఆర్‌ఎస్‌ 4 చోట్ల గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన తెల్దేవర్‌పల్లి ఎంపీటీసీ నున్సావత్‌ పార్వతి ఎంపీపీగా.. చిత్రియాల ఎంపీటీసీ జాల ప్రేమలత (కాంగ్రెస్‌) వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. మొత్తం 6ఎంపీటీసీ స్థానాలున్న నేరేడుగొమ్ము మండలంలో 4స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ నుంచే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు ఎన్నికయ్యారు. కొత్తపల్లి ఎంపీటీసీ బాణావత్‌ పద్మ ఎంపీపీ, నేరేడుగొమ్ము ఎంపీటీసీ అరెకంటి ముత్యాలమ్మ వైస్‌ ఎంపీపీగా ఎంపికయ్యారు. కేతేపల్లి మండలంలో మొత్తం 11ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 4, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌లో నెలకొన్న పోటీని ఆసరాగా చేసుకొని స్వతంత్రుల సాయంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలు గెలుచుకోవాలని చూసిన కాంగ్రెస్‌ ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు.

ఎంపీపీగా కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన కొప్పోల్‌ ఎంపీటీసీ పెరుమాళ్ల శేఖర్‌కే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు సైతం మద్దతు ప్రకటించారు. వైస్‌ ఎంపీపీగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన చెరుకుపల్లి ఎంపీటీసీ పెదబొస్క మాదవి వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతో ఎంపీపీగా ఎన్నికైన శేఖర్‌ ఆ తర్వాత శాసన మండలి తాత్కాలిక చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఈ నెల 7న టీఆర్‌ఎస్‌ గెలిచిన 21స్థానాలకు శనివారం నేరేడుగొమ్ము, కేతేపల్లి సైతం తోడయ్యాయి. మొత్తం టీఆర్‌ఎస్‌ 23, కాంగ్రెస్‌ 8ఎంపీపీ స్థానాల్లో జెండా ఎగురవేసింది. జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 24, కాంగ్రెస్‌ 7గెలుచుకున్న సంగతి తెలిసిందే. జడ్పీ చైర్మన్‌గా బండా నరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఇరిగి పెద్దులు ఎంపికైన విషయమూ విధితమే. సూర్యాపేట జిల్లా చిలుకూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల ప్రశాంతి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...