దోస్త్ తొలి దశ పూర్తి


Thu,June 13, 2019 03:26 AM

- ఉమ్మడి జిల్లా పరిధిలో 33,990 డిగ్రీ సీట్లు
- మొదటి విడుతలో నిండింది 5,460
- 8 కళాశాలల్లో అడ్మిషన్లు నిల్
- కళాశాలల్లో చేరేందుకు ఈ నెల 15 చివరి గడువు
ఎంజీయూనివర్సిటీ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 93 డిగ్రీ కళాశాలలు దోస్త్‌లో అనుమతి పొందాయి. అయితే వీటిలో నల్లగొండ జిల్లాలో 40, సూర్యాపేటలో 27, యాదాద్రిభువనగిరిలో 26కళాశాలలు ఉన్నాయి. (వీటిలో సూర్యాపేటలో ఒక బధిరుల కళాశాల ఉంది) వీటన్నింటిలో వివిధ కోర్సుల్లో 33,990 సీట్లు ఉన్నాయి. అయితే మే 23నుంచి ఈ నెల 6వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు చేసుకోగా వీరికి తొలిదశలో కళాశాలల్లో అడ్మిషన్లను కల్పిస్తూ ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కమిషనరేట్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీటు కల్పిస్తూ తొలి దశ పూర్తి చేశారు. తొలి విడుతలో సీటు వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్‌ను తీసుకుని ఈ నెల 15లోగా ఆయా కళాశాలల్లో చేరుతున్నట్లు ఆన్‌లైన్‌ల్లోనే కళాశాల ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

తొలి విడుత నిండింది 5,460 సీట్లు మాత్రమే...
ఎంజీయూ పరిధిలో దోస్త్‌లో తొలి విడుత అడ్మిషన్ల ప్రక్రియలో 5,460 సీట్లు మాత్రమే నిండాయి. ఈ తొలి విడుత సీట్ల కేటాయింపులో 8 కళాశాలల్లో సున్నశాతం అడ్మిషన్లు వచ్చాయి. అయితే ఈ విద్యార్థులంతా సీటు వచ్చిన కళాశాలల్లో ఈ నెల 15లోగా ఆన్‌లైన్ అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకోని ఆ కళాశాలల్లో చేరుతున్నట్లుగా సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంది.
8 కళాశాలల్లో సున్నశాతం అడ్మిషన్లు...
ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8కళాశాలల్లో దోస్త్‌లో తొలి విడుతలో సున్నాశాతం అడ్మిషన్లు కావడం విశేషం. కాగా సున్నా అడ్మిషన్లు వచ్చిన కళాశాలల్లో నల్లగొండ జిల్లాలో శ్రీసాయిభారతి డిగ్రీ కళాశాల, శ్రీసిద్దార్థ డిగ్రీ కళాశాల -మునుగోడు, సూర్యాపేట జిల్లాలో కోమటిరెడ్డి ప్రతీక్‌మెమోరియల్ డిగ్రీ కళాశాల-నూతనకల్, శ్రీమాతా సరస్వతి డిగ్రీ కళాశాల-ఎనుబాముల, శ్రీసాయి డిగ్రీ కళాశాల -తిరుమలగిరి, యాదాద్రిభువనగిరి జిల్లాలో శ్రీస్నేహ డిగ్రీ కళాశాల-భువనగిరి ఉన్నాయి.

గతేడాది కంటే తగ్గిన సీట్లు
గత సంవత్సరం 2018-19దోస్తు అడ్మిషన్లలో ఎంజీయూ పరిధిలో 100 కళాశాలల్లో 36,905సీట్లు ఉండగా తొలి విడుత 7,950 సీట్లు నిండాయి. అయితే ఈ పర్యాయం గతంకంటే సీట్లు తగ్గినప్పటికీ అడ్మిషన్లు కూడా తగ్గాయి. ఈ పర్యాయం తొలి విడుతలో ప్రభుత్వ కళాశాలల్లో ఆశాజనకంగానే అడ్మిషన్లు జరుగగా ప్రైవేట్ కళాశాలల్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. రెండో విడుతలో వీటి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది.

కళాశాలల్లో అడ్మిషన్లు ఇలా...
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 10 ప్రభుత్వ, 2 ఏయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో-6, సూర్యాపేట జిల్లాలో-3 (2 ప్రభుత్వ, 1 ఏయిడెడ్), యాదాద్రిభువనగిరి జిల్లాలో-3 (2 ప్రభుత్వ, 1 ఏయిడెడ్) ఉన్నాయి. అయితే అత్యధికంగా నల్లగొండ-ఎన్జీ కళాశాలలో సీట్లు నిండగా నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడుతలో అతి తక్కువగా సీట్లు భర్తీ అయినవి. అదే విధంగా నల్లగొండ జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో 7,100 సీట్లకుగాను 858, సూర్యాపేట జిల్లాలో 9,670 సీట్లకుగాను 1300, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7,060 సీట్లకుగాను 1141సీట్లు భర్తీ అయ్యాయి.
రెండో దశ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ వివరాలు...
తొలి విడుత సీటు వచ్చిన విద్యార్థులు - ఈ నెల 10నుంచి 15వరకు కళాశాలలో రిపోర్టు చేయాలి.
రెండో విడుత రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ - ఈ నెల 10నుంచి 15వరకు
సీటు అలాట్‌మెంట్ రెండోలిస్టు - ఈ నెల 20వరకు
రెండో విడుత సీటు వచ్చిన విద్యార్థులు - ఈ నెల 20నుంచి 25వరకు కళాశాల్లో చేరాలి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...