రెవెన్యూ యంత్రాంగంలో చలనం


Wed,June 12, 2019 01:56 AM

-రిటైర్డు ఆర్డీఓ కుటుంబానికి పాస్ పుస్తకాలు
-విచారణ చేసి అందజేసిన రెవెన్యూ యంత్రాంగం
-నమస్తే తెలంగాణ ధర్మగంట ఎఫెక్ట్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : రిటైర్డు ఆర్డీఓ కుటుంబానికి పాస్ పుస్తకాలు జారీ చేయడంలో అలసత్వం వహించిన కనగల్ రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కనగల్ రెవెన్యూ శివారులోని సర్వే నెం.1357, 1358లో 15 కుంటల భూమిని కొనుగోలు చేసినా రిటైర్డు ఆర్డీఓ బషీరుద్దీన్ కుటుంబసభ్యులకు ఉన్నటువంటి భూమిని పాస్ పుస్తకంలో నమోదు చేసి వాటిని జారీ చేయడంలో అలసత్వం వహించిన అధికారుల తీరును ఎండగడుతూ నమస్తే తెలంగాణ రాసిన కథనంతో ఎట్టకేలకు బాధిత కుటుంబ సభ్యులకు పాస్ పుస్తకాలు జారీ చేశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈ కథనంపై ఆరా తీసి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించి విచారణ చేయాలన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి సూచన మేరకు కనగల్ రెవెన్యూ యంత్రాంగం విచారణ చేసి ఎట్టకేలకు పాస్ పుస్తకాలను జారీ చేశారు. రిటైర్డు ఆర్డీఓ బషీరుద్దీన్ భార్య వాయిదున్నిసాకు 1358లో 3 ఎకరాల 20 గుంటల భూమి, పెద్ద కొడుకు మాసియుద్దీన్ పేరిట 1357లో 2 ఎకరాల 13 గుంటలు, 1358లో ఎకరం 20 గుంటల భూమి ఉంది.

రెండో కుమారుడు సనియుద్దీన్ పేర 1357లో 2 ఎకరాల 14 గుంటలు, 1358లో ఎకరం 20 గుంటలు చిన్న కుమారుడు జియావుద్దీన్ పేర ఉండగా 15 గుంటలే పట్టా చేశారు. అయితే సదరు భూమిలో బషీరుద్దీన్ కుటుంబసభ్యులే కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంటున్నప్పటికీ పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం మూలంగా రిటైర్డు ఆర్డీఓ బషీరుద్దీన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు మే 16న జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయడంతో పాటు నమస్తే తెలంగాణను ఆశ్రయించారు. దీంతో గత నెల 17న రిటైర్డు ఆర్డీఓకు తప్పని వ్యథ అనే పేరుతో నమస్తే తెలంగాణ మెయిన్‌లో ధర్మగంట శీర్షికలో కథనం ప్రచురించడం జరిగింది. దీనికి స్పందించిన కనగల్ రెవెన్యూ యంత్రాంగం 1358 సర్వే నెంబర్‌లో బషీరుద్దీన్ భార్య వాయిదున్నిసా పేరు మీద 3 ఎకరాల 20 గుంటలతొ పాటు పెద్దకుమారుడి పేరు మీద ఉన్న ఎకరం 20 గుంటలు సైతం సరి చేసి ఇచ్చారు. ఇక రెండో కుమారుడు పేరు మీద 2 సర్వే నెంబర్లలో ఉన్న 3 ఎకరాల 34 గుంటలకు సంబంధించి తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి పాస్ పుస్తకం ముద్రణ కోసం పంపారు. చిన్నకుమారుడి పేరుమీదున్న ఎకరం 25 గుంటలు పహాణీలో రావడం మూలంగా కాస్ర పహాణీ ఆధారంగా రికార్డులు సరి చేసి పాస్ పుస్తకాలు అందజేశారు. అయితే షేక్ రహమత్‌బీ, షేక్ లతీఫ్‌ల పేరిట ఈ భూమి నమోదైనందున వారి ఖాతాలో అన్‌సైన్ చేసి రిటైర్డు ఆర్డీఓ కుటుంబాలకు సంబంధించిన ఖాతాల్లో సైన్ చేసి పాస్ పుస్తకాలు అందజేసినట్లు కనగల్ తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...