మూడో విడుత ముమ్మరం


Tue,June 11, 2019 02:34 AM

-రైతు బంధు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
-ఎకరాకు రూ.5వేలు అందజేస్తున్న తెలంగాణ సర్కార్
-ఇప్పటి వరకు 52వేల మంది రైతుల ఖాతాలు ఆన్‌లైన్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం తెలంగాణ సర్కారు రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడో విడుతలో భాగంగా ఇప్పటికే 52వేలమంది రైతుల ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ట్రెజరీకి పంపించారు. దీంతో ఎకరాకు రూ.5వేల చొప్పున 11,280మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా 4.14లక్షల మంది రైతులుండగా తాజా సమాచారంతో వ్యవసాయ విస్తరణ అధికారులు ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి రైతు బంధు పథకం డబ్బులు ఆలస్యం కాగా.. ఈనెలాఖరుకల్లా అందరికీ అందజేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసింది.

జిల్లావ్యాప్తంగా రైతు బంధు మూడో విడతలో భాగంగా వ్యవసాయ యంత్రాంగం డేటా ఆధారంగా ట్రెజరీ శాఖ అధికారులు 11,280 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,14,272మంది రైతులుండగా అందుకు రూ.579,96,36,660 పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వ్యవసాయాధికారులు మొత్తం 4.14లక్షల మంది రైతుల్లో 1.34లక్షల రైతులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగా 52,276మంది వివరాలు బ్యాంకు ఖాతాలతో సహా ట్రెజరీకి వెళ్లింది.దీంతో ప్రభుత్వం రూ.60.30కోట్లు విడుదల చేయగా జిల్లా వ్యాప్తంగా 564గ్రామాల్లో ఒక్కో గ్రామం నుంచి 20మంది చొప్పున మొత్తం 11,280 మందికి సొమ్ము జమ చేశారు.

ముమ్మరంగా అందజేత..
రైతు బంధు పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్‌కు అందజేసే పెట్టుబడి సాయానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ నెల మొదటి వారంవరకు కోడ్ అమలులో ఉండడం వల్ల రైతుల బా్ంయకు ఖాతాల్లోకి నగదు జమ చేయలేని పరిస్థితి. అయితే గడిచిన 2,3 రోజులుగా రైతు బంధును రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేసి ఇప్పటి వరకు ఈ ఏడాది తొలి విడతగా వానాకాలం సీజన్ కింద ఇవ్వాల్సిన రైతు బంధు నగదును ఇచ్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రైతులకు సంబంధించిన తాజా వివరాలు సేకరిస్తు ఎప్పటికప్పుడు ఏఈవోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలోని 564 గ్రామాల్లో రెగ్యులర్‌గా రైతు బంధు పథకానికి సంబందించిన వివరాల సేకరణ జరుగుతుంది.

మూడో విడతలో ఎకరాకు రూ.వెయ్యి పెంపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగిన ప్రతి రైతుకు గత ఏడాది నుంచి ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.4వేల చొప్పున గడిచిన ఏడాదిలో రెండు దఫాలుగా రూ.8వేలు పెట్టుబడి సాయం కింద అందజేసింది. అయితే గత ఎన్నికల హామీలో భాగంగా ఈ పెట్టుబడి సాయం ఎకరానికి మరో వేయి రూపాయలు పెంచి రూ.5వేలు చొప్పున అందజేస్తుంది. అంటే ఎకరం భూమికలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి రెండు సీజన్లలో రూ.10వేలు అందనుంది. గత ఏడాది మొదటి విడత ఏప్రిల్ 20 నుంచి ఈ పథకం అమలు కాగా రెండో విడత యాసంగి సీజన్‌లో బాగంగా గత సంవత్సరం డిసెంబర్‌లో అందజేశారు. ప్రస్తుతం వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నందున ఏప్రిల్, మే నెలల్లో రైతు బందు నగదును ఇవ్వడం ఆలస్యమైంది. ఈ నెల తొలి వారంలో ఎన్నికల కోడ్ ముగియడంతో సర్కార్ ఆదేశాల మేరకు రైతు బందు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను అధికార యంత్రాంగం వేగంగా చేపట్టింది.

మూడో విడత అందజేస్తున్నాం...
ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడో విడతలో భాగంగా రైతు బంధు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నాం. అన్ని గ్రామాల్లోను తాజాగా రైతుల వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 11వేలమంది రైతులకు పైగా ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి.
- శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...