శరవేగంగా ఎన్‌హెచ్-167 విస్తరణ పనులు


Mon,May 27, 2019 02:57 AM

-రూ.300కోట్లతో జడ్చర్ల- ఖమ్మం రహదారి నిర్మాణం
-నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ
-తగ్గనున్న రోడ్డు ప్రమాదాలు.. ప్రయాణం ఇక సులువు

హాలియా, నమస్తే తెలంగాణ: జడ్చర్ల నుంచి-ఖమ్మం వరకు సుమారు రూ.300 కోట్లతో చేపడుతున్న జాతీయ రహదారి(ఎన్‌హెచ్-167)విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హధిర నుంచి ఖమ్మం జిల్లా వరకు సుమారు 500కి.మీ మేర రోడ్డు పనులు చేపడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ నుంచి వెళ్తున్న (ఎన్‌హెచ్-167) రహదారిని కర్ణాటక రాష్ట్రంలోని హధిర ప్రధాన జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. జడ్చర్ల నుంచి-ఖమ్మం వరకు మొత్తం 4 ప్యాకేజీలుగా విభజించి రహదారి విస్తరణ పనులను చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మల్లేపల్లి నుంచి మిర్యాలగూడ వరకు 2 ప్యాకేజీలుగా విభజించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. మల్లేపల్లి నుంచి అనుముల మండలంలోని అలీనగర్ వరకు సుమారు 40కి.మీ మేరకు 2వ ప్యాకేజీ, అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు సుమారు 30కి.మీ మేర 3వ ప్యాకేజీలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. జడ్చర్లను మొదలుకోని ఖమ్మం వరకు జాతీయ రహదారిని విస్తరణ గావిస్తుండడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు మహర్దశ పట్టనుంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల మీదుగా రహదారిని నిర్మించనున్నారు. రహదారికి ఇరువైపుల 50ఫీట్లకు మేర రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. ఇందులో 33ఫీట్ల వెడల్పు గల తారు రోడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారిని పూర్తిగా తొలగించి సుమారు 3ఫీట్ల ఎత్తులో నూతనంగా రహదారిని ఏర్పాటుచేస్తున్నారు. కంకరపరిచి రోలింగ్ చేయడం వంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. 2వ ప్యాకేజీలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర సమీపంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2వ ప్యాకేజీలో మల్లేపల్లి నుంచి ప్రారంభమైన రోడ్డు విస్తరణలో భాగంగా పెద్దవూర మండలం పోతునూరు వద్ద టోల్‌ప్లాజాను ఏర్పాటుచేస్తుండగా, 3వ ప్యాకేజీలోని అలీనగర్ వద్ద టోల్‌ప్లాజాను ఏర్పాటుచేస్తున్నారు. రహదారి పూర్తయ్యాక వెళ్లే వాహనాలకు టోల్‌ప్లాజా వద్ద టోల్(పన్నును) వసూలు చేస్తారు. ఈప్రాంతం నుంచి రహదారి విస్తరణ గావిస్తుండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. రహదారిని విస్తరించనుండడంతో వాహనాల రాకపోకలు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతంగా ఇరుకుగా ఉండి గుంతలు పడిన రహదారిపై ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

తగ్గనున్న వాహన ప్రమాదాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లను మొదలుకొని ఖమ్మం జిల్లా కేంద్రం వరకు సుమారు 270కి.మీ మేరకు ప్రస్తుతం జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఖమ్మం నుంచి జడ్చర్ల వరకు ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాల సంఖ్య వందల్లో ఉంటాయి. ప్రతి రోజు వందలాది బస్సులు, సిమెంట్ లారీలు, ఇతర వాహనాలు ఈ రహదారిపై వెళ్తుంటాయి. వాహనాల్లో రద్దీ అధికంగా ఉండడం, సింగిల్‌రోడ్డుపై నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాల్లో కొందరు ప్రాణాలను కోల్పోతుండగా మరికొంత మంది క్షతగాత్రులుగా మారి విగత జీవులవుతున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారి సింగిల్‌రోడ్డుగా కావడంతో రోడ్డు వెడల్పు ఇరుకుగా ఉండడంతో పెద్ద వాహనాలు ఎదురెదురు అయినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి విస్తరణతో రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉంది.

ఇరుకు కల్వర్టులకు మోక్షం...

రహదారిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇరుకు కల్వర్టులతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాహనాలు క్రాసింగ్ అయ్యే సమయాల్లో, వాహనాలు ఎదురెదురు అయినప్పుడు ఒక వాహనం వెళ్లేవరకు మరో వాహనం ఆగాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో కల్వర్టులు కూలిపోయి ప్రమాదాలు జరిగేవి. రహదారి విస్తరణలో భాగంగా సుమారు110 ఇరుకు కల్వర్టులు వెడల్పుకానున్నాయి.

ప్రయాణ సమయం ఆదా...

జడ్చర్ల నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారిని విసర్తించడం ద్వారా ఖమ్మం నుంచి మహబూబ్‌నగర్, శ్రీశైలం, బెంగుళూరు, కర్నాటక, ముంబై వంటి మహా నగరాలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగదు. ప్రస్తుతం గుంతలు, ఇరుకు రోడ్లతో వాహనాలు వేగంతో వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దూరభారమయ్యే ప్రయాణికులకు గతుకుల రోడ్లతో సమయం అధికమవ్వడంతోపాటు ప్రయాణికులకు విసుగు కలిగించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...