ఇండ్లు కట్టిస్తామని రూ.8.1 కోట్లు కుచ్చుటోపీ


Sun,May 26, 2019 03:45 AM

-మాల్యవి కరుణోదయ సొసైటీ పేరుతో డమ్మీ సంస్థ ఏర్పాటు
-2,700 మందిని మోసం చేసిన ఆరుగురు మాయగాళ్లు
- నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
-రూ.12.22 లక్షల నగదు, రెండు లాప్‌ట్యాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

భువనగిరి అర్బన్ : ఆఫర్ అట్రాక్, మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఇండ్లు కట్టిస్తామని నమ్మించి నాలుగు జిల్లాల పరిధిలోని 2,700మందిని మోసం చేసి రూ.8.1కోట్లు కాజేసిన వ్యక్తులను ఎస్‌ఓటీ, జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఎక్స్‌రోడ్, లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొండ కృష్ణమ్మ, కొండ రమేష్, ఖమ్మం జిల్లా జెల్ల చెరువు, కుసుమంచి పోస్టుకు చెందిన కొండ వెంకటనారాయణ, ద్వారకచంద్ర రెసిడెన్సీ, వియజపూరి కాలనీ, కర్మన్‌ఘాట్ సరూర్‌నగర్‌కు చెందిన కట్టమహేంద్రనాథ్ ఠాగూర్, ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన కొత్తరాజిరెడ్డి, చైతన్యనగర్ జడ్చర్లకు చెందిన జజర్ల సాయిచరణ్ మొత్తం ఆరుగురు కలిసి 2004లో కర్మన్‌ఘాట్ సరూర్‌నగర్ రంగారెడ్డి జిల్లాలో మాల్యవి కరుణోదయ సోసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

-సోసైటీ సభ్యులు చేసే పనులు..
2004 నుంచి యాదాద్రి భువనగిరి, జనగాం, నల్లగొండ, సిద్దిపేట జిల్లాలోని మండలాల్లో ఉన్న గ్రామాల్లో సోసైటీ చేసే పనులు గురించి ప్రజలకు వీరు అవగాహన కల్పించేవారు. వీరితో పాటు కొందరు సభ్యులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రతి గ్రామంలోని ప్రజలు, వికలాంగులకు, ఇల్లు లేని వారికి మాల్యవి కరుణోదయ సోసైటీ మీకు రూ.7.50లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తుంది. ఇందుకు గాను ఇటుక, సిమెంట్ వంటి మెటిరియళ్ల కొనుగోలు కోసం ముందుగా మీరు రూ.30వేలు చెల్లించాలి అని నమ్మించసాగారు. ఆలేరు మండలంలోని టంగుటూర్, కొలనుపాక, కాచారం, కాల్వపల్లి, రాజపేట, మోటకొండూర్, యాదగిరిగుట్ట మండలాల్లో అక్కడక్కడ నిర్మించిన కొన్ని ఇండ్లు, ప్రారంభ దశలో ఉన్న పిల్లర్ల ఫొటోలు, వీడియోలు తీసి ప్రజలకు చూపించి నమ్మించారు. మొదట రూ.30వేలు తరువాత రూ.2.20లక్షలు చెల్లిస్తే సరిపోతుందని, మిగతా రూ.5లక్షల ఎన్‌ఆర్‌ఐ సంస్థల నుంచి వస్తాయని వారికి నమ్మ బలికారు. 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు మొత్తం నాలుగు జిల్లాల నుంచి సుమారు 2,700 మంది వద్ద నుంచి రూ.8.1కోట్లు వరకు వసూలు చేశారు. ఆరునెలలు గడుస్తున్నా సంబంధిత సొసైటీ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉండకపోవడంతో ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వడ్డేపల్లి విజయ ఆలేరు పీఎస్‌లో కొండ కృష్ణమ్మపై మార్చి 25న ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు.

-పక్కా ప్లాన్‌తో అరెస్టు చేసిన పోలీసులు
వడ్డేపల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదుతో మాల్యవి కరుణోదయ సొసైటీపై పోలీసులు నిఘా పెంచారు. సొసైటీ అడ్రస్, సభ్యుల వివరాలను సేకరించారు. ఈనెల 25న కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్‌లో మాల్యవి కరుణోదయ సొసైటీ సభ్యులు ఉన్నట్టుగా సమాచారం రావడంతో ఉదయాన్నే అక్కడకు వెళ్లిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. కాగా మరో ఇద్దరు కొత్త రాజిరెడ్డి, జజర్ల సాయిచరణ్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.12.22 లక్షల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు, 8 బిల్‌బుక్కులు, క్యాష్ రిసీప్ట్ పుస్తకాలు, 29 సోసైటీ లెటర్‌ప్యాడ్లు, స్టాంపులు, కరపత్రాలు, దరఖాస్తు ఫారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టుకు అప్పగిస్తామని, బాధితులు ఫిర్యాదు చేసి కోర్టు ద్వారా తాము కట్టిన సొమ్మును పొందాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సురేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్ రాజు, ఎస్‌ఓటీ టీం సీఐ అంజనేయులు, ఎస్‌ఐ వై.లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...