కాంగ్రెస్ విజయం


Fri,May 24, 2019 04:21 AM

-నల్లగొండ ఎంపీగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి గెలుపు
-టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25682ఓట్ల ఆధిక్యం
-2.1శాతం ఓట్ల తేడాతో ఓటమి తప్పించుకున్న పీసీసీ చీఫ్
-ఏడింట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ
-సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ లీడ్
-నల్లగొండ, భువనగిరి స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్‌లో జోష్

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి నల్లగొండ ఎంపీగా పోటీచేసిన పీసీసీ చీఫ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నల్లమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 11,75,703 ఓట్లు పోలవగా.. అందులో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 5,26,028 ఓట్లు లభించాయి. రెండో స్థానంలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డికి 5,00,346 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్రకుమార్‌కు 52,709ఓట్లు, సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లు లక్ష్మికి 25089ఓట్లు లభించాయి. మొత్తం 25రౌండ్లలో ఫలితం వెల్లడి కాగా.. తొలి రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం స్వల్పంగా పెరుగుతూ వచ్చింది.

సూర్యాపేటలో పెరిగిన టీఆర్‌ఎస్ ఆధిక్యం...
నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ స్థానాల్లో మినహా మిగిలిన అన్నిచోట్లా కాంగ్రెస్‌కు మెజారిటీ దక్కింది. సూర్యాపేటలో 11499, నల్లగొండలో 3484 ఓట్లు టీఆర్‌ఎస్‌కు అదనంగా రాగా.. కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్‌లో 12,993, కోదాడలో 11930, మిర్యాలగూడలో 7186, నాగార్జున సాగర్‌లో 3695, దేవరకొండలో 4567ఓట్లు అధికంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం పెరిగింది. సూర్యాపేటలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల నాటికంటే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓట్లు ఈసారి టీఆర్‌ఎస్‌కు లభించాయి. శాసనసభ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి గెలవగా.. మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే.

తొలిసారి ఎంపీగా..
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలతోపాటు హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అంతకు ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్వస్థలం. 1962 జూన్ 20న పురుషోత్తం రెడ్డి, ఉషాదేవి దంపతుల సంతానంగా జన్మించిన ఉత్తమ్.. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సైనికుడిగా చేరారు. మిగ్21, మిగ్23 వంటి యుద్ధ విమానాలకు పైలట్‌గా పని చేసి.. కెప్టెన్ హోదాకు చేరుకున్నారు.

తర్వాత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన ఉత్తమ్.. 1999 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2004 ఎన్నికల్లోనూ మళ్లీ ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో హుజూర్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. 2009, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసన సభ్యుడిగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2015 ఫిబ్రవరి నుంచి పీసీసీ చీఫ్‌గా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను సైతం నిర్వహిస్తున్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...