పట్టణాల్లో వ్యాయామశాల


Tue,May 21, 2019 01:35 AM

-ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు
-జిల్లాకు 12 జిమ్‌లు మంజూరు
-ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తికావొచ్చిన పనులు

దేవరకొండ, నమస్తేతెలంగాణ : హైటెక్‌ యుగంలో ప్రజల జీవన విధానంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు రకరకాల లక్ష్యాలు, ఒత్తిళ్ళతో సతమతమవుతున్నారు. ఖాళీ సమయమే లేకుండా నిత్యం బిజీబిజీగా గడుపుతున్న పట్టణవాసులు తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుబాటులో జిమ్‌లు లేకపోవడం కూడా ఇందుకు కొంత కారణమవుతుండగా.. రాష్ట్ర పురపాలకశాఖ ప్రతి మున్సిపాలిటీలో ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. టీఎండీపీ(తెలంగాణ మున్సిపాలిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు) ప్రపంచ బ్యాంకు నిధులతో మొదటివిడతగా రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీలలో 112వ్యాయామశాలలను ఏర్పాటుచేస్తోంది. ఇందుకు గాను ఒక్కో ఓపెన్‌ జిమ్‌కు రూ.15 లక్షల నిధులను కేటాయించింది. ప్రత్యేక ఏజెన్సీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు, ప్రభుత్వస్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాకు 12 జిమ్‌లు మంజూరు...
నల్లగొండ జిల్లాలోని నల్లగొండ మున్సిపాలిటీకి 6 ఓపెన్‌ జిమ్‌లు మంజూరు కాగా, మిర్యాలగూడ మున్సిపాలిటీకి 4 జిమ్‌లు, దేవరకొండ మున్సిపాలిటీకి 2 జిమ్‌లు మంజూరు అయ్యాయి. నల్లగొండ పట్టణంలోని రాజీవ్‌పార్కులో ఇప్పటికే ఓపెన్‌ జిమ్‌ పనులు పూర్తికావొచ్చాయి. అలాగే దేవరకొండ పట్టణంలోని ఎల్‌ఐసీ కాలనీ, స్థానిక పోలీస్‌స్టేషన్‌ పక్కన రెండు జిమ్‌లకు సంబంధించి పనులు పూర్తి అయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలోని 4జిమ్‌ల పనులు కూడా పూర్తికావొచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండడంతో కోడ్‌ ముగిశాక పనులు పూర్తిచేసుకున్న జిమ్‌లను అధికారులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు ప్రభుత్వం రెండోవిడతలో ఓపెన్‌ జిమ్‌లను మంజూరు చేయనుంది.

అందుబాటులో 13 రకాల పరికరాలు...
మున్సిపాలిటీల పరిధిలోని పార్కులు, ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటుచేస్తున్న ఓపెన్‌జిమ్‌లను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. ఒక్కో జిమ్‌లో వివిధరకాల వ్యాయామాల కోసం దాదాపు 13రకాల పరికరాలకు సంబంధించి ఎయిర్‌ వాకర్‌, పుష్‌ చైర్‌/ చెస్ట్‌ ప్రెస్‌, ఎయిర్‌స్వింగ్‌, షోల్డర్‌ వీల్‌, లెగ్‌ ప్రెస్‌, పుల్‌ ఛైర్‌/షోల్డర్‌ ప్రెస్‌, స్టాండింగ్‌ ట్విస్టర్‌, రోయింగ్‌ మిషన్‌, డబుల్‌ చాస్‌ వాకర్‌, ఎలిప్టికల్‌ మెషీన్‌, లెగ్‌ లిఫ్ట్‌, టైచీ స్పిన్నర్‌ వీల్‌, సిట్టింగ్‌ ట్విస్టర్‌ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని...
పట్టణాలలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తగా ఒపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తోంది. నిత్యం ప్రజలు వ్యాయామం కోసం ఏ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లోనే ఒపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. అన్ని హంగులతో అధునాతనమైన పరికరాలతో తీర్చిదిద్దిన జిమ్‌లను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
- పూర్ణచందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, దేవరకొండ

పట్టణ ప్రజలు సద్వినియోగపర్చుకోవాలి..
దేవరకొండ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఒక జిమ్‌ను, ఎల్‌ఐసీ కాలనీలో మరో జిమ్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. పనులు కూడా పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చిన్నపిల్లలు మొదలుకొని వృద్దుల వరకు ప్రతిఒక్కరు వ్యాయామం చేసే పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణప్రజలు ఓపెన్‌ జిమ్‌లను సద్వినియోగం చేసుకోవాలి.
- వడ్త్య దేవేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, దేవరకొండ

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...