జయంత్యుత్సవాలకు శ్రీకారం


Thu,May 16, 2019 02:21 AM

-స్వస్తీవాచనంతో ప్రారంభం
-వైభవంగా లక్షపుష్పార్చన
-యాదాద్రిలో ఉత్సవ కైంకర్యాలను ప్రారంభించిన అర్చకులు
-హాజరైన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిలో జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం బాలాలయంలో స్వస్తీవాచనం, విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యాహవాచనం, ఋత్విక్‌వరణం, రక్షాబంధనాలతో పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వస్తీవాచనంలో భాగంగా విశ్వశాంతి, లోక కల్యాణార్థం శ్రీవారిని స్తుతించారు. సర్వవిధ ఆటంకాలు తొలిగి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగేలా విశ్వక్సేనారాధనను నిర్వహించారు. పుణ్యాహవాచనంలో భాగంగా స్థల, ద్రవ్యాలతోపాటు సమస్త నదుల జలాలను మంత్రాలతో ఆవాహన చేసి మూలవరులు, ఉత్సవవరులు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. అనంతరం బుత్విక్‌ వరణాన్ని నిర్వహించారు. శ్రీవారు, అమ్మవారికి నూతనంగా తయారు చేసిన బెల్లం లడ్డూలను సమర్పించారు. అనంతరం విక్రయశాలకు తరలించారు.
వైభవంగా లక్షపుష్పార్చన..
లోకంలో సకల సంపదలు విలసిల్లాలని శ్రీవారు, అమ్మవారికి వైభవంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 8గంటలకు నిత్యహవాహనం, మూలమంత్ర జపాలు, పారాయణాలు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీత్యా ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. భగవానుడు పుష్ప వేడుకల ద్వారా అహింస అనే ప్రథమ పుష్పము, ఇంద్రియ నిగ్రహము అనే రెండో పుష్పము స్వీకరిస్తూ భక్తుల అభౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలను తొలగిస్తూ రక్షిస్తాడని నమ్మకం. సాయంత్రం బాలాలయంలో నిత్య హవాహనాలు, మూలమంత్ర జపాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, మంత్రపుష్ప నీరాజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహుడు తిరువేంకటపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తుల పాలిట కల్పతరువై కోర్కెలు తీర్చే స్వామిగా వినతికెక్కారు. అంతటి మహిమాన్వితుడైన వేంకటేశ్వరుని అలంకారంలో యాదాద్రీశుడు కనువిందు చేశారు.

వైకుంఠనాథుడిగా శ్రీవారి దర్శనం..
జయంతి ఉత్సవాల్లో బుధవారం రాత్రి యాదాద్రీశుడు పరవాసుదేవ అలంకారంలో దర్శనమిచ్చారు. వైకుంఠనాథుడికే పరవాసుదేవుడని పేరు. నిత్యులు, ముక్తులు, నిత్యం పరవాసుదేవుడిని స్మరిస్తూ కాలాన్ని గడుపుతారని వేదాల్లో పేర్కొనబడింది. అంతటి ప్రాధాన్యం గల పరవాసుదేవుడిగా యాదాద్రిలో శ్రీవారు కనువిందు చేశారు. ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, యాజ్ఞీకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం నిర్వహించిన పుష్పార్చనలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...