కాంగ్రెస్‌ను ఖతం చేద్దాం..అభివృద్ధిని కొనసాగిద్దాం


Fri,April 26, 2019 01:12 AM

- జిల్లాలో ఫ్లోరోసిస్ పీడ ఆపార్టీ పాపమే
- అభివృద్ధిని అడ్డుకున్నందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిర్రు
- రెండు ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం
- మూడు జిల్లా పరిషత్‌లలో గులాబీ జెండా ఎగురేస్తాం
- పీసీసీ, ఏఐసీసీలు వచ్చినా బండా గెలుపును అడ్డుకోలేరు
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- నార్కట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌శ్రేణుల భారీ బైక్‌ర్యాలీ

నార్కట్‌పల్లి : జిల్లాకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని పరిషత్ ఎన్నికల్లో ఖతం చేసి జిల్లా అభివృద్ధిని కొనసాగించుకుందామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నార్కట్‌పల్లి పట్టణంలోని శబరి గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ప్రాదేశిక ఎన్నికల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన బిడ్డే ఫ్లోరిన్ మహమ్మారి అని దానిని తరిమేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతీ మాట అబద్ధం, పూటకో మోసం చేసే కాంగ్రెస్ నేతల దుర్మార్గానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫ్యూడల్ మనస్తత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ బయట పడలేక పోతున్నారని, అలాంటి నేతల చేతుల్లో చిక్కే ఉమ్మడి నల్లగొండ జిల్లా నాశనమైందన్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాను ఏలిన నేతలు వారేనని, అటువంటి నేతలే ఫ్యూడల్ భావజాలంతో అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. తాము అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేస్తామని ప్రకటించినందుకే మొన్నటి శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని పేర్కొన్నారు. అటువంటి వారి పాలన నుంచి బయట పడేందుకు జిల్లా ప్రజలకు 35 ఏళ్లు పట్టిందన్నారు. 2014 ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ పార్టీకి 6 శాసన సభ, ఒక లోక్‌సభ స్థానాన్ని కట్టబెట్టిన జిల్లా ప్రజలు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఏలిననాటి శనిని వదిలింకున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.

ఈ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా మూడు జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తారతమ్య బేధం లేకుండా అభివృద్ధి జరుగుతుందని, అందుకు నిదర్శనమే మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలేనని అన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో నాశనమైన దేవరకొండ, మునుగోడులతో పాటు అభివృద్ధి జాడలేని నకిరేకల్ నియోజక వర్గంలో తెలంగాణ పాలనలో పంట పొలాలకు సమృద్ధిగా నీరందుతుందన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి ఫలాలను అందుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలనే స్థిరమైన నిర్ణయానికి వచ్చారన్నారు. దీంతో పాటు ముఖ్య మంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఆకర్శితులై స్థానిక శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారన్నారు. మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం రాజకీయ భవిష్యత్తును ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్దేషిస్తారని తెలిపారు. పాతాకొత్తల మేలు కలయిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఉద్యమ కాలంలోనే నార్కట్‌పల్లి మండలం చైతన్యవంతంగా నిలిచిందని ఇక్కడి నుండే జైలుకు కూడా తాను వెళ్లానని తెలిపారు. అటువంటి మండలం నుంచి ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రచారంతో పాటు సమావేశం నిర్వహించడం శుభ సూచకమని అభివర్ణించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులు బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ పనుల్లో గతంలో యంత్రాలు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు స్వాహా చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని మరచారన్నారు.

ముఖ్య మంత్రి కేసీఆర్ సహకారంతోనే ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్శితుడినై, నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గంలోనే ఉంటూ నియోజక వర్గాన్ని టీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పని చేశానని, సాధించుకున్న తెలంగాణ వచ్చిన తర్వాతే పేద ప్రజల తలరాతలు మార్చింది కేసీఆరే అని స్పష్టం చేశారు. ముఖ్య మంత్రి సహకారంతో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగానని ప్రజలకు మంచి చేసే అవకాశం ముఖ్య మంత్రి ఇచ్చారన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పోరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, కటికం సత్తయ్య, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వైస్ ఎంపీపీ పుల్లెంల పద్మ ముత్తయ్య, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎండీ రహీంఖాన్, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి. మచ్చ ముత్యాలు, పుల్లెంల అచ్చాలు గౌడ్, బాజ యాదయ్య, చిరుమర్తి యాదయ్య, పజ్జూర నర్సిరెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బండాను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇవ్వాలి
కొత్తపాత కలయికలతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సమష్టగా ప్రచారం నిర్వహిస్తూ నార్కట్‌పల్లి జడ్పీటీసీతో పాటు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సన్నద్ధం కావాలి. బండా నరేందర్‌రెడ్డిని జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్య మంత్రి కేసీఆర్‌కు బహుమతిగా అందజేయాలి.
- తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ ఎన్నికల పరిశీలకుడు

భువనగిరిలో కోమటిరెడ్డికి ఓటమి తప్పదు
అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల్లో భువనగిరిలో కూడా ఓటమి తప్పదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మండలంలో జడ్పీటీసీగా పోటీ చేస్తాడని ప్రకటిస్తున్నరు. ఇక ఆయన కూడా ఓడిపోయిన అనంతరం కుటుంబ సభ్యులతో కోమటిరెడ్డి అమెరికాకు పయనమయ్యే సమయం ఆసన్నమైంది.
-బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యుడు

నకిరేకల్ నియోజకవర్గానికి గోదావరి జలాలు
ముఖ్య మంత్రి కేసీఆర్ సారధ్యంలో నియోజకవర్గానికి త్వరలోనే గోదావరి జలాలు వస్తాయి. ఇకపై రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి కోసం ప్రజలు పడ్డ ఇబ్బందులు ఇక పూర్తిస్థాయిలో తీరినట్లు. బండా నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన ర్యాలీతో ప్రతిపక్షాలు నామినేషన్ కూడా దాఖలు చేసే పరిస్థితి లేదు.
- బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ

బండా గెలుపునకు కృషి చేయాలి
ఉద్యమ సమయంలో బండా నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ వెంటే ఉండి తెలంగాణ సాధనకు ఎనలేకి కృషి చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయం.
- శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
నార్కట్‌పల్లి : కనగల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిమర్రి గ్రామ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి, శాబ్దుల్లాపురం సర్పంచ్ జ్యోతి రవీందర్‌రెడ్డి సహా నార్కట్‌పల్లి మండలానికి చెందిన పలువురు మాజీ, తాజా సర్పంచ్‌లతో పాటు 100మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో కొండూరి శంకర్, బత్తుల అంజిరెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కసిరెడ్డి మనోహర్‌రెడ్డి, మేడి పద్మ శంకర్, మాదాసు నర్సింహ, రవీందర్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...