రెండో విడుతకు రెడీ


Fri,April 26, 2019 01:10 AM

(మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ) జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న మలివిడత ప్రాదేశిక ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల పరిధిలో 109 ఎంపీటీసీలు 10 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని మండల కేంద్రాల్లో మండలపరిషత్ అభివృద్ధి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29న నామినేషన్ల పరిశీలన, 30న అప్పీల్, మే 1న తిరస్కరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.

అభ్యర్ధుల ఎంపికలో రాజకీయ పార్టీలు
మే 10న జరిగే మలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో రాజీకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించుతున్నారు. వారి బలాబలాల పరిస్థితి ఏంటని బేరీజు వేసుకుని ఇతర పార్టీల వారు అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి వీరిలో మెరుగైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కాగా పోటీలో నిలిచేందుకు ఆశావహులు అధికంగా ఉన్నారు. వీరిని బుజ్జగించి గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఆశావహులు అధికంగానే ఉన్నారు. ముందస్తుగా ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానంలో అందరిని సమన్వయ పరిచి అభ్యర్థులను ఎంపిక చేస్తేనే రెబల్స్ బెడద ఉండదని నియోజకవర్గ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రాదేశిక ఎన్నికలపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి ప్రాదేశిక ఎన్నికలు ఎంతగానో దోహదపడనున్నందున టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేకదృష్టి సారించింది. ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని మండల, గ్రామస్థాయి నాయకులకు ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. గత అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల స్పూర్తిని అదే ఊపును కొనసాగించాలని ఇటీవల తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లాలకు ఇన్‌చార్జిలను కూడా నియమించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలపైనే ఎంపీటీసీ, జడ్పీటీసీల గెలుపు బాధ్యతలను మోపడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు కృషి చేస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించినట్లుగానే ఈ ప్రాదేశిక ఎన్నికల్లో పూర్తి ఆదిత్యాన్ని ప్రదర్శించేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ముందుకుపోతున్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...