ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు


Fri,April 26, 2019 01:10 AM

నల్లగొండక్రైం : బస్‌లలో మహిళల బ్యాగు నుంచి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేస్తున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర దొంగలను గురువారం గుర్రంపోడు మండలం లక్ష్మీదేవిగూడెం స్టేజీ వద్ద గుర్రంపోడు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అరెస్టు చేసి విచారించగా చోరీలు వెలుగులోకి వచ్చాయి. గురువారం పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా గాయత్రీనగర్ నందనవనం ప్రాంతానికి చెందిన గారిక అలియాస్ గారడి జ్యోతి అలియాస్ కవిత అలియాస్ వెంకటరమణ అనే మహిళ చోరీలకు పాల్పడుతుండగా 2015లో బీబీనగర్ పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జైలుకు రిమాండ్ చేశారు.

కొద్ది రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కొన్ని రోజులు దొంగతనాలకు పాల్పడకుండా ఉంది. ఇటీవల ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని కర్నూలు జిల్లా గుత్తి గ్రామం దగ్గర ఉన్న చర్చిలో సత్తిపాటి మానస అలియాస్ రాధ అనే మహిళ పరిచయం కావడంతో ఇరువురు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ నుంచి మల్లేపల్లి వచ్చి మల్లేపల్లి నుంచి నల్లగొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఎక్కి వస్తుండగా మార్గమధ్యలో గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామం వద్ద ఒక మహిళ బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఆ సొమ్మును అమ్మి వచ్చిన డబ్బుతోపాటు మరి కొంత డబ్బును కలిపి మారుతి కారు కొనుగోలు చేశారు. అనంతరం హైదరాబాదలోని హనుమాన్‌గూడకు చెందిన అచ్చింతల కళ్యాణ్ శ్రీనిధి కాలేజిలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. అతడిని కారు డ్రైవర్‌గా పెట్టుకుని ముఠాగా ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల బస్సులలో చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, గుర్రంపోడు వద్ద చోరీ జరిగిన కేసులో మహిళ ఇచ్చిన ఫిర్యాధు ఆధారంగా గురువారం వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనపడడంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చాయని వారు తెలిపారు. ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, ఏఎస్‌ఐ ఉపేందర్‌స్వామి, సిబ్బంది విష్ణువర్ధన్‌గిరి, వెంకటకృష్ణ, గుర్రంపోడు సబ్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్, ఏఎస్‌ఐ కోటిసింగ్, కానిస్టేబుల్ రవికుమార్‌ను డీఎస్పీ అభినందించారు.

జిల్లాలో నాలుగు దొంగతనాలు..
నల్లగొండ జిల్లాలో బస్సులలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళల నుంచి చోరీలు చేశారు. గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ, నల్లగొండ రూరల్ పరిధిలో-1, నల్లగొండ టూటౌన్ పరిధిలో-1 దొంగతనానికి పాల్పడ్డారు. ముఠా సభ్యులు నేరం చేసే విధానం... ఈ ముఠా సభ్యులు పగటిపూట వివిధ ప్రాంతాల్లో కారులో తిరుగుతూ రద్దీగా ఉన్న బస్సులలో మహిళల దగ్గర నుంచి బంగారు, వెండి నగదును మొదలగు వాటిని దొంగిలించి అదే కారులో పారిపోతారు. వీరి నుంచి 33తులాల బంగారు ఆభరణాలతోపాటు 10తులాల వెండి ఆభరణాలు, మారుతి కారును స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.15లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...