మూల్యాంకనంలో అనర్హులు


Thu,April 25, 2019 03:37 AM

రామగిరి : పదో తరగతి మూల్యాంకనం విధులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీనియారిటీ ప్రకారం ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, టీఎస్ మోడల్ స్కూల్స్‌లో పని చేస్తున్న ఆయా సబ్జెక్టులో ఉపాధ్యాయులకు ఉత్తర్వులను ముందస్తుగానే అందజేశారు. అయితే ఉత్తర్వులు లేని వారు నేరుగా మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు వీలుగా పాఠశాలల్లో పని చేస్తున్నట్లుగా సర్వీస్ సర్టిఫికెట్, రిలీవింగ్ ఆర్డర్ తీసుకొచ్చి అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. అయితే దేవరకొండలోని టీఎస్ మోడల్ స్కూల్‌లో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తాను విధులకు హాజరు కావడంతో పాటు తన సర్వీస్ సర్టిఫికెట్, రిలీవింగ్ ఆర్డర్‌ను జీరాక్స్ తీసి మరో ఇద్దరు కూడా అదే స్కూల్‌లో పని చేస్తున్నట్లుగా డుబ్లికేట్ పత్రాలు సృష్టించి మూల్యాంకన విధుల ఉత్తర్వులను ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.

సంఘటన వెలుగులోకి వచ్చిందిలా...
పదో తరగతి మూల్యాంకన విధులకు హాజరయ్యేందుకు దేవరకొండలోని టీఎస్ మోడల్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌కు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. అయితే పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాల లెటర్ ప్యాడ్‌ను తయారు చేసి పేరు, సబ్జెక్టు లేకుండా ఖాలీ సర్వీస్, రిలీవింగ్ పత్రాన్ని అతనికి పంపించినట్లు తెలిసింది. దానిని కలర్ జీరాక్స్ తీసుకుని మూల్యాంకన విధులకు హాజరయ్యాడు. దీనిపై అధికారులు సైతం అభ్యంతరం తెలపక పోవడంతో ఇదే అదనుగా భావించిన సదరు ఉపాధ్యాయుడు దేవరకొండకు చెందిన కేజీబీవీ నుంచి మూల్యాంకనానికి స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చిన ఇద్దరికి తన ధ్రువపత్రాన్ని కలర్ జీరాక్స్ తీసి టీఎస్ మోడల్ స్కూల్‌లో పని చేస్తున్నట్లుగా సర్వీస్ సర్టిఫికెట్ సృష్టించి క్యాంపు అధికారులకు అందజేసి మూల్యాంకన ఉత్తర్వులను ఈ నెల 16న ఇప్పించాడు. వారు దీంతో పదో తరగతి ఇంగ్లీష్ మీడియంకు చెందిన సాంఘీక శాస్త్రం 100 పేపర్లను మూల్యాంకనం చేశారు. ఈ విషయాన్ని ఇతర కేజీబీవీల నుంచి వచ్చిన వారు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో తేరుకున్న క్యాంపు ఆఫీసర్, డీఈఓ పి. సరోజినిదేవి, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణ అధికారి, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ విజయభారతి వారిని గుర్తించి విధుల నుంచి తొలగించడంతో పాటు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లను సీఈలతో తిరిగి మూల్యాంకనం చేయించామని విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగలేదని తెలిపారు.

నలుగురికి నోటీసులు
పేరు, సబ్జెక్టు లేకుండా ఖాళీ రిలీవింగ్ ఆర్డర్‌ను జారీ చేసిన దేవరకొండ డివిజన్‌కు చెందిన ఓ టీఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు అదే పాఠశాల నుంచి మూల్యాంకన విధులకు వచ్చిన పీజీటీ ఉపాధ్యాయుడు, అర్హత లేకుండా మూల్యాంకనం నిర్వహించిన కేజీబీవీ ఇద్దరు ఉపాధ్యాయులకు నోటీసులను జారీ చేశారు. ఇందులో ముగ్గురు డీఈఓకు వివరణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని మరొక ఉపాధ్యాయుడి నుంచి కూడా వివరణ రాగానే పై అధికారుల సూచనల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ వెల్లడించారు.

పత్రాల పరిశీలనలో నిర్లక్ష్యం
స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరయ్యే వారి వివరాలను స్పష్టంగా పరిశీలించాల్సిన అధికారులు వాటిని చూడకపోవడంతోనే సమస్య చోటు చేసుకుందని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒకే పాఠశాల నుంచి ముగ్గురు సాంఘీక శాస్త్రం ఉపాధ్యాయులు ఎలా విధులకు వస్తారనే విషయాన్ని అధికారులు గుర్తించలేక పోవడమే ఈ పరిణామానికి కారణంగా మారింది. కేజీబీవీ నుంచి వచ్చిన వారిలో ఒక ఉపాధ్యాయురాలు సాంఘీక శాస్త్రం బోధిస్తుండగా మరో వ్యక్తి ఆ పాఠశాలలో అకౌంటెంట్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విధులకు హాజరు కాని వారికి సైతం
పదో తరగతి మూల్యాంకనం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాఠశాలల్లోని ఆయా సబ్జెక్టుల సీనియర్ ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ అందజేసింది. ఉత్తర్వులు తీసుకున్న వారిలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. నల్లగొండ అర్బన్ పాఠశాలల నుంచే 20 మంది రాలేదని తెలుస్తోంది. వీరందరికి ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

వెంటనే గుర్తించి నోటీసులిచ్చాం
పదో తరగతి మూల్యాంకన విధుల్లో అర్హులు కాకుండా పాల్గొంటున్న కేజీబీవీకి చెందిన వారిని వెంటనే గుర్తించాం. విచారణ చేసి వారిని విధులకు హాజరయ్యేలా తప్పుడు పత్రాలు సృష్టించిన టీఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడితో పాటు కేజీబీవీ, ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే వారిపై చర్యలుంటాయి. మూల్యాంకన విధుల కోసం ఉత్తర్వులు పొంది హాజరు కాకుండా ఉన్న ఉపాధ్యాయులకు సైతం నోటీసులు జారీ చేస్తాం.
-పి. సరోజినీదేవి, డీఈఓ, మూల్యాంకన కేంద్రం అధికారి

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...