డబుల్ వేగంతో..


Wed,April 24, 2019 02:17 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పనుల్లో ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో ఇండ్ల నిర్మాణం శరవేగంతో సాగుతోంది. ఒక్కో ఇంటిని 561 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంట్లో హాలు, రెండు పడక గదులు, వంట గది, స్నానాల గది ఉండేలా నమూనా రూపొందించారు. ఒక్కో ఇంటికి రూ.5.04లక్షలను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ చూస్తోంది. దేవరకొండ నియోజకవర్గంలో కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ తరహాలో నిర్మాణాలు చేపడుతుండగా.. స్థలం కొరత లేని ప్రాంతాల్లో ఒక్కో ఇంటిని నిర్దేశిత స్థలంలో నిర్మిస్తున్నారు. సకల సదుపాయాలతో ఇండ్లు రూపుదిద్దుకుంటుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం నింపుతోంది.

ముందంజలో దేవరకొండ
ప్రభుత్వం మొదటి దశలో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున జిల్లాకు 2,400 ఇండ్లను మంజూరు చేసింది. జిల్లాలో 2,065 ఇండ్ల్లకు తొలిదశలో పరిపాలన అనుమతులు ఇచ్చారు. 1,951 ఇండ్లకు టెండర్లు పిలవగా ప్రస్తుతానికి వెయ్యికి పైగా ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రెండో విడుతలో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల చొప్పున 6 వేల ఇండ్లను ప్రభుత్వం మం జూరు చేసింది. రెండు దశల్లో చేపడుతున్న ఇండ్ల పనులు వేగవంతంగా సాగుతుండగా.. పలుచోట్ల ఇప్పటికే నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. అక్కడక్కడా గ్రామాల ఎంపిక పూర్తయినప్పటికీ ఇండ్ల్ల నిర్మించేందుకు స్థలాల ఎంపిక కోసం పరిశీలన జరుగుతోంది. త్వరితగతిన టెండర్లు పిలిచేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే పూర్తయిన 580 ఇళ్లు
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని 10 మండలాలకు మొదటి దశలో 400 ఇండ్లు, రెండవ దశలో వెయ్యి ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి లో 580 ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో నిర్మించిన ఇండ్లకు అన్ని వసతులు సమకూర్చగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. దేవరకొండ అర్బన్‌కు 400 ఇండ్లు మంజూరుకాగా వీటిలో 345 పూర్తి కావచ్చాయి. కొండమల్లేపల్లిలో 30 ఇండ్లు, చింతపల్లిలో 25, చందంపేటలో 25, ముడుదండ్లలో 30, హంక్యతండాలో 25, గాగిళ్లాపూర్‌లో 25, చిత్రియాలలో 30 ఇండ్లు పూర్తికావచ్చాయి.

సర్వాంగ సుందరంగా ..
సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఫలితంగా.. అంతర్గత సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణం, మిషన్ భగీరథ నీళ్లు ఇలా.. ఆధునిక హంగులతో ఇండ్లు ముస్తాబవుతున్నాయి. కాలనీలో విశాలమైన రహదారులతో పాటు విద్యుత్ సౌకర్యం, మురుగు కాల్వల నిర్మాణం సైతం చేపడుతున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కొండభీమనపల్లిలోని డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రత్యేకించి ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను కూడా నాటారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రెండు, మూడు పర్యాయాలు వీటిని సందర్శించారు కూడా.

బీఈడీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎంజీ యూనివర్సిటీ: మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా బీఈడీ సెమిస్టర్ -2 రెగ్యులర్, సెమిస్టర్-1 బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు ఎంజీయూ సీఓఈ డా.మిర్యాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30లోగా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా, రూ. 200 అపరాధ రుసుంతో మే 3లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే నిబంధనల మేరకు చర్యలుంటాయని హెచ్చరించారు. అన్ని పేపర్లకు రూ. 960, రెండు పేపర్ల వరకు 660, ఇంప్రూమెంట్ ప్రతి పేపర్‌కు 660 చొప్పున మాత్రమే వసూలు చేయాలని వెల్లడించారు. పీహెచ్‌సీలకు ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

బీఈడీ 3వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 85.15 శాతం ఉత్తీర్ణత
ఎంజీయూనివర్సిటీ: మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల బీఈడీ 2017-19 బ్యాచ్ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం సాయం త్రం ఎంజీయూలో విడుదల చేశారు. పరీక్షలకు 2492 మంది హాజరు కాగా 2122 మంది ఉత్తీర్ణత సాధించి 85.15 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలను www. mguniversity.ac.inలో పొందు పరిచినట్లు తెలిపారు. బీఈడీ పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యంపై నమస్తే తెలంగాణ మినీలో మార్చి 25న మహాత్మా..ఇదేమిటి..., పరీక్షలు నిర్వహించారు.. ఫలితాలు మరిచారు అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు ఫలితాలు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
మే 9 నుంచి యూజీ ఇయర్‌వైజ్,
సెమిస్టర్ పరీక్షలు
మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న యూజీ ఇయర్‌వైజ్ బ్యాక్‌లాగ్, సెమిస్టర్ (1 నుంచి 6 సెమిస్టర్ వరకు) పరీక్షలను మే 9 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డా. మిర్యాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెమిస్టర్ 1,2 పరీక్షలను మే 13 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...