బరిలో ఎవరు?


Mon,April 22, 2019 11:51 PM

- ఉమ్మడి జిల్లా అంతటా స్థానిక సంస్థల ఎన్నికల సందడి
- ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పైనే అన్ని స్థాయిల్లో చర్చ
- నామినేషన్ల పర్వం మొదలవడంతో మరింత హుషారు
- టీఆర్‌ఎస్ నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న నేతలు
- కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు అభ్యర్థులు కరువైన స్థితి
- గెలవలేమని తెలిసిన స్థానాల్లో ఏకగ్రీవాలకు ఏర్పాట్లు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. మళ్లీ జిల్లా మొత్తం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోలాహలంతో వేడెక్కింది. ఇప్పటికే తొలిదశలో భాగంగా వచ్చే నెల 6న పోలింగ్ జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ సైతం మొదలైంది. తొలిరోజు అయిన సోమవారమే పలువురు ఉత్సాహవంతులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో తొలిరోజు ఎంపీటీసీ స్థానాలకు-66, జడ్పీటీసీ స్థానాలకు-3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్-34, టీఆర్‌ఎస్-23, స్వతంత్రులు-6, బీజేపీ-2, టీడీపీ-ఒకరు నామినేషన్ వేశారు. జడ్పీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్-2, బీజేపీ నుంచి ఒక్క నామినేషన్ దాఖలయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని 8 మండలాల పరిధిలో తొలిరోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్-4, టీఆర్‌ఎస్-1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 24 నామినేషన్లు వేయగా.. కాంగ్రెస్-14, టీఆర్‌ఎస్ -2, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంపీటీసీలకు-21, జడ్పీటీసీలకు-0 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు, రేపు కూడా నామినేషన్ దాఖలుకు గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా పలుచోట్ల అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్థానాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.

అవకాశం కోసం టీఆర్‌ఎస్ నుంచి పోటాపోటీ
శాసనసభతోపాటు పంచాయతీ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఏకపక్ష విజయ దుంధుబి మోగించిన నేపథ్యంలో ఈసారి కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ అదే తరహా ఉత్సాహం నెలకొంది. దీంతో టీఆర్‌ఎస్ టిక్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయి లో పోటీ పడుతున్నారు. ఎంపీటీసీలతోపాటు జడ్పీటీసీ స్థానాలకు సైతం పోటీ పడాలనుకునే ఆశావహులు త మ తమ శక్తి మేరకు అన్ని స్థాయిల్లో ప్రయత్నిస్తున్నారు. తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కివచ్చినా కొన్నిస్థానాల్లో మాత్రం నేడు అందరి పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అన్ని రకాలుగా ఆలోచించి పార్టీకి లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏ అవకాశం దక్కని వారికి.. గెలిచే శక్తి ఉన్నవాళ్లకు.. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లకు.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి.

సానుభూతి కోణంపై ప్రతిపక్షాల కన్ను
అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంటే.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వంటే నువ్వు పోటీ చేయమంటూ ఒకరిని మరొకరు ముందుకు నెడుతున్నారు తప్పితే నేనే పోటీ చేస్తానంటూ ఆయా పార్టీల నుంచి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఆయాపార్టీల ముఖ్యనేతలు స్వయంగా ఫోన్ చేసి అడిగినా అభ్యర్థులు ఉత్సాహం చూపడం లేదని సమాచారం. మరోవైపు కొన్ని గ్రామాల్లో తమకు ఏమాత్రం గెలిచే అవకాశం లేదని భావించి.. ఊరి మంచి కోసం అంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవ మద్దతుతో గెలిపించే ప్రయత్నాలు సైతం ఎక్కువగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. తొలిదశ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో ఖరారయ్యే ఈ సంఖ్య భారీగానే ఉంటుందని ఓ అంచనా నెలకొంది. గెలిచే అవకాశం లేకున్నా.. పోటీ చేసి కనీసం పరువు నిలుపుకోవాలని, పోటీని ఇచ్చామనే సంకేతాన్నయినా ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనలోనూ కొందరు ప్రతిపక్ష నేతలు ఆలోచిస్తున్నట్లు వినికిడి.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...