జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి


Sat,April 20, 2019 12:03 AM

రామగిరి : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, నర్సరీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులకు సహకరించాలన్నారు. ఇప్పటికే మండల, డివిజన్ వారీగా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించినట్లు తెలిపారు. జిల్లాలో 31 మండలాల్లో 31 జడ్పీటీసీలు, 349 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలకు 941 లోకేషన్లలో 1927 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9.67లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. 400 నుంచి 600 ఓటర్లకు పీఓ, ఏపీఓ, నలుగురు ఓపీఓలు, 400 కంటే తక్కువ ఓటర్లున్న పోలింగ్‌కేంద్రాల్లో పీఓ, ఏపీఓ, ముగ్గురు ఓపీఓలు విధులు నిర్వహిస్తారని తెలిపారు.

ప్రతి మండల కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్‌కు కేంద్రాలను గుర్తించాలన్నారు. జిల్లాలో మొదటి దశలో దేవరకొండ డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాగ్రత్తగా గుర్తులు కేటాయించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. అదే విధంగా ధరణి ద్వారా పాస్‌పుస్తకాల సవరణ పూర్తి చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి జిల్లాను జూన్ 2 నాటికి ఓడీఎస్‌గా ప్రకటించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ, నిబంధనలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల అర్హతల గురించి మాస్టర్ ట్రైనర్ తరాల పరమేష్ వివరించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, జగన్నాథరావు, లింగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...