రైతుకు మద్దతు ధర కల్పించాలి


Sat,April 20, 2019 12:03 AM

- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర కల్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తూ వాతావరణ పరిస్థితులను బట్టి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లోను రెగ్యులర్‌గా వాట్సప్ గ్రూప్‌లలో కేంద్రాల వారిగా పర్యవేక్షణ చేయాలని డీఆర్‌డీఓను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలనుననుసరించి పట్టాలు కప్పి ఉంచడం జరుగుతుందన్నారు. రైతులు తమ ధాన్యానికి సంబందించి పట్టాలు సమకూర్చుకుని తీసుకునిరావాలని, ఈ విషయంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వివరించాలన్నారు. ప్రతి రోజు ధాన్యం ఎంత కొనుగోలు చేశారు? ఎంత పరిమాణం మిల్లులకు పంపించారు..

కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ఎంత ధాన్యం రాశులు ఉన్నాయి? రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ వద్ద ఉన్న 1200 పట్టాలు, 68 తూకం యంత్రాలు కొనుగోలు కేంద్రాలకు అవసరమున్న చోట సరఫరా చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో క్యూలైన్లు నిర్వహించి వరుసగా టోకెన్లు అందజేయాలని సూచించారు. లారీ కాంట్రాక్టర్ లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపడంలో స్పందించకుంటే చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల డీఎంను ఆదేశించారు. హమాలీ మేస్త్రీలు రైతులను ఇబ్బందికి గురి చేయకుండా ధాన్యం లిఫ్టు చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం వెంటనే అన్‌లోడ్ చేయాలని మిల్లర్లకు సూచించారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన రైతుల ధాన్యం తీసుకోవడంలో సహకరించాలన్నారు. మిల్లర్లు సమస్య లేకుండా పౌరసరఫరాల డీటీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీఓ జిల్లా సహకార అధికారులు కేంద్రాల వారిగా పర్యవేక్షించాలని తహసీల్దార్, జిల్లా అధికారులు కూడా కేంద్రాలను సందర్శిస్తారన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్‌రావు, జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి, మార్కెటింగ్ అధికారి అలీం పాల్గొన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...