ఎట్టకేలకు నోటీసులు...


Wed,April 17, 2019 01:34 AM

-ఎంజీయూలో అక్రమంగా నియామకాలైన వారిపై చర్యలు
-ప్రభుత్వ ఆదేశాలతో 32మందికి నోటీసులు జారీ
-అక్రమార్కుల గుండెల్లో గుబులు
-ఏడు నెలల తర్వాత చర్యలతో హర్షం
ఎంజీయూనివర్సిటీ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 2011-12లో రెగ్యులర్ బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన నియామకాలు చేపట్టలేదని అప్పటి నుంచి పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, లోకాయుక్త లాంటి ప్రముఖ సంస్థలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వంలో అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ అక్రమ నియామకాలపై దృష్టి సారించింది. అయితే 2018 సెప్టెంబర్ 10న ఎంజీయూ పాలకమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం 32మంది బోధనా సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ అక్రమ నియామకాలపై ఆది నుంచి నమస్తే తెలంగాణ మినీలో పలు కథనాలు ప్రచురించి వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విధితమే.

నియామకాలు జరిగిందిలా..
యూనివర్సిటీలో 7కోర్సులు బోధించేందుకు 56అధ్యాపక పోస్టులకు సెప్టెంబర్ 2011లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకు 2012 ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించగా 32 మంది హాజరు కావడంతో ప్రొబెషన్ కింద అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించారు. మిగిలిన 24పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు హాజరు కాకపోవడంతోనే నియామకాలు చేపట్టలేదని అప్పటి యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. కాగా ఏపీఐపీబీఏఎస్ స్కోర్ 300పాయింట్లు కనీసం లేని వారిని కూడా ఈ నియామకంలో చేసినట్లు బహిర్గతమైంది.

అక్రమాలు జరిగింది ఇలా..
ప్రభుత్వం, యూజీసీ జారీ చేసిన పోస్టులకు వ్యతిరేకంగా నియామకాలు చేపట్టారు. ఎలాగంటే ఎంబీఏ టూరిజం కోర్సు పోస్టులను జనరల్‌కు కేటాయించి ఏడుగుర్ని, పార్మస్యూటికల్ కెమిస్ట్రీకి మంజూరైన 10పోస్టులను జనరల్ కెమిస్ట్రీ కోర్సుకు కేటాయించి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా.. అనర్హులైన తమ అస్మదీయులకు పెద్దపీట వేశారని ఒక్క రోజులోనే వందలాది మందికి ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించారని అప్పటి నుంచి వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. దీనిపై అన్యాయానికి గురైన అభ్యర్థులు 2012 మార్చి, మే, సెప్టెంబర్‌లో, 2013, 2014, 2015లో సహితం వేర్వేరుగా ఆర్టీఏ కింద నియామకం చేసిన తీరుపై సమాధానాలను వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను అడిగినా సరియైన సమాధానాలు ఇవ్వలేదు. వాటికి స్పందనలేకపోవడంతో కమిషనర్‌ను ఆశ్రయించడంతో అప్పటి వీసీ, రిజిస్ట్రార్లకు కమిషన్ నోటీసులు జారీచేసింది. అలా ఎన్నో కమిటీలు, కమిషన్లు పరిశీలన చేసి చివరికి సిద్దికి కమిటీ నివేదిక మేరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించడంతో ఎట్టకేలకు అక్రమ నియామకాలపై తెరపడింది.

పాలక మండలి నిర్ణయంతోనే..
సెప్టెంబర్ 10, 2018న హైదరాబాద్‌లో జరిగిన ఎంజీయూ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏడు మాసాల తర్వాత 32మంది బోధనా సిబ్బందికి ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. ఎం.యాదగిరి, వీసీ ప్రొ. ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ మంగళవారం సమావేశమై నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి అందించిన నివేదికల ఆధారంగానే తమకు అందిన ఉత్తర్వుల మేరకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 15 రోజుల లోపల నోటీసులు అందుకున్న వారంతా అందుకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మాత్రం నోటీసులు అందుకున్న వారు బయటకు పొక్కకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. ఏదేమైనా అక్రమంగా నియామకం అయిన వారిపై కొరడా ఝళిపిస్తూ చర్యలు తీసుకోవడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...