ఘన విజయమే లక్ష్యంగా..


Fri,March 22, 2019 02:41 AM

- నల్లగొండ, భువనగిరి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
- నల్లగొండకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్
- జిల్లా నేతలతో సంప్రదించి ఖరారు చేసిన అధినేత కేసీఆర్
- త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థిగా మాజీ ఎంపీ గుత్తా
- నేటి నుంచి తీవ్రం కానున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
- అట్టహాసంగా నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఏర్పాట్లు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ బరిలో నిలువనున్న అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఖరారయ్యారు. నల్లగొండ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త వేమిరెడ్డి నర్సింహా రెడ్డి, భువనగిరి నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పోటీ చేయనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సహా ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం అభ్యర్థిత్వాలను గురువారం ప్రకటించారు. నల్లగొండ తాజా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి త్వరలోనే ఖాళీ కానున్న శాసన మండలిస్థానం నుంచి అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను 3 లక్షల మెజారిటీతో గెలుచుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించిన టీఆర్‌ఎస్ ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సన్నాహక సమావేశాలను సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అభ్యర్థులు కూడా ఖారరవడంతో నేటి నుంచి ప్రచారం విస్తృతం కానుంది.

నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త వేమిరెడ్డి నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను బరిలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3లక్షల మెజారిటీతో రెండు ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టిన టీఆర్‌ఎస్.. అందుకు తగ్గట్లుగా ధీటైన అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు.

త్వరలోనే రాష్ట్రంలో నాలుగు శాసన మండలి స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో.. ఒక స్థానం నుంచి నల్లగొండ తాజా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ నల్లగొండ అభ్యర్థిగా గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరి అభ్యర్థిగా పీవీ శ్యాంసుందర్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నల్లగొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఘన విజయాలే లక్ష్యంగా అభ్యర్థులు ఖరారు...
నల్లగొండ, భువనగిరితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 16ఎంపీ స్థానాల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా లోతైన కసరత్తు చేసిన తర్వాతే టీఆర్‌ఎస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు స్థానాల్లో 3లక్షల ఆధిక్యత తగ్గకుండా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్ నిర్దేశించారు. కాంగ్రెస్ పార్టీ సైతం అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న స్థానాల్లో నల్లగొండ, భువనగిరి ఎంపీ సీట్లు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది.

భువనగిరి ఎంపీగా అయిదేండ్ల నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ పలు అభివృద్ధి పనులు సాధించిన సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌కు మళ్లీ అవకాశం కల్పించింది. ఎయిమ్స్‌తోపాటు పలు జాతీయ రహదారులు, భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం సాధించడంలో బూర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సూర్యాపేటకు చెందిన బూర.. ఎంబీబీఎస్ చదివిన అనంతరం వైద్య వృత్తిని చేపట్టారు. డాక్టరుగా వైద్య సేవలు అందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల జేఏసీ చైర్మన్‌గా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి తొలిసారే ఘన విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నల్లగొండ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డి స్వస్థలం మునుగోడు మండలం చల్మెడ గ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన నర్సింహారెడ్డి.. అంచెలంచెలుగా ఎదిగి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 1997 నుంచి స్నేహిత అగ్రి బయోటెక్ ఎండీగా.. 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపార వేత్తగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు.

బంగారు తెలంగాణలో భాగస్వామినవుతా...
- వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లగొండ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి
నా మీద నమ్మకం ఉంచి నల్లగొండ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి.. నా ఎంపికకు సహకరించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యమ అధినేత కేసీఆర్ సారథ్యంలో వారి ఆశయ సాధన కోసం కృషి చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్‌ఎస్ నాయకులు, నల్లగొండ పార్లమెంట్ ప్రజలు అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నా. ఘన విజయంతో నల్లగొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేసి.. పార్లమెంటులో మన ప్రాంత వాణిని వినిపిస్తా.

మరింత ఉత్సాహంతో రెట్టింపు అభివృద్ధి..
- బూర నర్సయ్య గౌడ్, భువనగిరి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి
ఎంపీగా నేను చేసిన కృషి, అభివృద్ధి పనులు గుర్తించి.. నా పై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఐదేండ్లలో భువనగిరి ఎంపీగా గతంలో ఏ ఎంపీ చేయనంత అభివృద్ధి చేశాను. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు సహా ఎన్నో సాధించుకొచ్చాను. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి.. మరింత అభివృద్ధి సాధించడానికి రెండోసారి భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగురబోతోంది. కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించనుంది.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...