ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుర్తింపుకార్డు తప్పనిసరి : కలెక్టర్


Fri,March 22, 2019 02:39 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి గాను ఓటర్ స్లిప్‌తో పాటు ఓటర్ గుర్తింపుకార్డును చూపాలని కలెక్టర్, ఉపాధ్యాయ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డును సమర్పించలేనటువంటి ఓటర్లు, వారి గుర్తింపును నిరూపించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 9రకాల ఫొటోతో కూడిన ఏదేని ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, నల్లగొండ డివిజన్ పరిధిలో ఎన్జీ కళాశాలలో, మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, దేవరకొండ డివిజన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, జిల్లాలో 30 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా అందులో 3859 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది సకాలంలో నిర్వహించాలని, పోలింగ్ ముగిసే వరకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో ఎలా ఓటువేయాలనేదానిపై ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఎన్నికల ఏజెంట్లకు గుర్తింపుకార్డు, పీఓ జారీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల ఏజెంట్లుగా ఉండరాదని సూచించారు. పోలింగ్ సిబ్బందికి రాత్రి బస, పోలింగ్ రోజు భోజన వసతి సదుపాయాలను ఆర్డీఓలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌తోపాటు పీఓ, డైరీ ఫారం-16, పేపర్ సీలు అకౌంట్, డిక్లరేషన్ కవర్స్‌తో సహా రిసెప్షన్ సెంటర్లకు అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...