ఎంపీ అభ్యర్థి ఎవరు.?


Tue,March 19, 2019 02:48 AM

- అన్ని పార్టీల పార్లమెంట్ అభ్యర్థులపై జిల్లా అంతటా ఉత్కంఠ
- అధికారికంగా ఎవ్వరినీ ఖరారు చేయని రాజకీయ పార్టీలు
- టీఆర్‌ఎస్ వ్యూహాత్మక విధానం.. సన్నాహక సమావేశాలు పూర్తి
- ఎన్నికలకు పూర్తి ఉత్సాహంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు
- ఎటూ తేల్చని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీజేఎస్
- అన్ని ప్రతిపక్ష పార్టీల్లో స్తబ్ధత.. ఎన్నికలకు సిద్ధం కాని అనాసక్తత
- ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న వారిలోనూ లోలోపల నిరుత్సాహమే
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 25 వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. కానీ నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు మాత్రం ఏ పార్టీ ఇంకా తమ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం మినహా అన్ని పనులనూ చక్కబెడుతున్న అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే.. మరే రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు ఇంకా సన్నద్ధం అయినట్లు కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ బలవంతంగా ఎవరో ఒకరిని బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నా.. పొత్తులు పెట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నా అవి ఫలించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ చుట్టే కాంగ్రెస్ నేతలు, తేలని టిక్కెట్లు ..
పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌లో మాత్రం ఏ సన్నాహకమూ ముందుకు సాగడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించిన వారినే మరోసారి ఎంపీలుగా బరిలోకి దించేందుకు ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలైన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే ప్రచారం ఆ పార్టీ నాయకులే చేస్తున్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ రెండు స్థానాల పైనా మొదటి నుంచి పలువురు హస్తం నేతలు ఆశ పెట్టుకున్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ అభ్యర్థులుగా ఖరారైతే.. టిక్కెట్ ఆశించిన మిగిలిన నేతలను ఒప్పించడం.. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కంటే పెను సవాల్ కానుంది.

బీజేపీ సైతం ఇప్పటికీ ఇంకా అభ్యర్థులను తేల్చలేదు. భువనగిరి నుంచి పీవీ శ్యాం సుందర్ పేరు ఖరారైందని.. నల్లగొండ ఎంపీగా సీనియర్ నాయకులు గోలి మదుసూదన్ రెడ్డి, గార్లపాటి జితేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పొత్తు పెట్టుకోవాలా? ఒంటరిగా పోటీ చేయాలా? వంటి కీలక అంశం పైనే ఇప్పటికీ చర్చిస్తున్న సీపీఐ, సీపీఎంలు.. అభ్యర్థులు ఎవరనే అంశం పై అంతంత మాత్రంగానే చర్చిస్తున్నట్లు సమాచారం. నల్లగొండ నుంచి సీపీఎం పోటీ చేసే అవకాశం ఉందని.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, మహిళా నాయకురాలు మల్లు లక్ష్మిలలో ఎవరో ఒకరు బరిలో ఉంటారని తెలుస్తోంది. భువనగిరి నుంచి సీపీఐ పోటీ చేసే అవకాశం కనిపిస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానాల్లోనూ పోటీ చేయాలని ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకత్వం తాజాగా తీర్మానించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుక్కోక తప్పదనిపిస్తోంది.

ఉత్సాహంలో టీఆర్‌ఎస్.. మెజారిటీలే టార్గెట్
భువనగిరితోపాటు నల్లగొండ పార్లమెంట్ స్థానంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో జరిగిన సన్నాహక సమావేశాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.. ఆ వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకపక్ష గెలుపు.. వెరసి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ గెలుపు సులభమనే అంచనాల్లో టీఆర్‌ఎస్ ఉంది. అలా అని ఆగిపోకుండా.. అన్ని పార్టీల కంటే ఉత్సాహంగా ఎన్నికల సమరంలో ముందుకు సాగుతోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం మినహా.. రెండు స్థానాల్లోనూ 3 లక్షల కంటే ఎక్కువ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా అన్ని వ్యూహాలను సిద్ధం చేసింది. నాలుగున్నరేండ్లలోనే తెలంగాణ తొలి ప్రభుత్వంగా ఉద్యమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతోపాటు.. కేంద్రంలో కీలక స్థానంలో ఉంటే సాధించగలిగే పనులను సైతం స్పష్టంగా వివరిస్తూ టీఆర్‌ఎస్ ప్రచార సరళి సాగనుంది. ఇప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న శ్రేణులు, పార్టీ నాయకుల ఉత్సాహం మరింత బలం చేకూర్చనున్నాయి. శాసన సభ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను పరిశీలించినపుడు కూడా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు లక్ష ఓట్లకు పైగా ఆధిక్యం ఉండడం.. త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ముందే కళ్లకు కడుతోంది.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...