కందుల కొనుగోళ్లకు సిద్ధం


Thu,January 10, 2019 02:01 AM

-నల్లగొండ, చండూరు, చిట్యాల, కొండమల్లేపల్లిలో కేంద్రాలు
-సంక్రాంతి అనంతరం ప్రారంభానికి మార్క్ చర్యలు
-క్వింటాకు రూ.5675 మద్దతు ధరతో కొనుగోళ్లు
-31వేల క్వింటాళ్లు కొనుగోలు చేయనున్న యంత్రాంగం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: వానాకాలం కంది పంట కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. మార్క్ ద్వారా నల్లగొండ, చండూరు, చిట్యాల, కొండమల్లేపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేయగా.. సంక్రాంతి పండుగ అనంతరం ప్రారంభించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 31వేల క్వింటాళ్లు లక్ష్యం పెట్టుకోగా మద్దతు ధరకు కొనుగోలుచేసి రెండ్రోజుల్లో డబ్బు చెల్లించనున్నారు. గతేడాది క్వింటాకు రూ.5450ఇవ్వగా ఈ ఏడాది రూ.225పెంచిన సర్కార్ రూ.5675 ధర నిర్ణయించింది.
కందులకు ఈసారి క్వింటాకు రూ.5675 చెల్లించే విధంగా ప్రభుత్వం మద్ధ్దతు ధరను నిర్ణయించింది. గతేడాది క్వింటాకు రూ. 5450 చెల్లించగా ఈసారి రూ.225పెంచి రూ. 5675గా నిర్ణయించారు. అయితే నాణ్యతతో కూడినటువంటి కందులకే ఈ ధరను చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. కందులను శుభ్ర పరిచి, ఆరబెట్టి మార్కెట్ సంబంధిత సిబ్బంది వద్ద టోకెన్ తీసుకుని విక్రయించాల్సి ఉంది. నాణ్యతా ప్రమాణాల విషయంలో వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర తిండిగింజలు 3 శాతం, దెబ్బతిన్నగింజలు 3 శాతం, స్వల్పంగా దెబ్బతిన్నగింజలు 4 శాతం, పక్వతకు రాని గింజలు 3శాతం, పుచ్చిపోయిన గింజలు 4 శాతానికి మించకుండా ఉండటంతో పాటు 12 శాతానికి తేమ మించకుండా ఉన్నటువంటి కందులనే మార్కెట్ కొనుగోలు చేయనున్నారు. అయితే రైతులు మార్కెట్ వచ్చేటప్పుడు పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు బ్యాంకు ఖాతా పుస్తకం, జిరాక్స్, ఆధార్ జిరాక్స్, ఏఈవోతో పంట సాగు ధ్రువీకరణపత్రాన్ని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీగా తగ్గిన కంది దిగుబడి...
జిల్లాలో ఈ ఏడాది కంది పంట సాగు గణనీయంగా తగ్గడంతో దిగుబడి సైతం పడిపోయింది. దీంతో ఈసారి కందులు మార్కెట్ పెద్దగా వచ్చే అవకాశం లేదు. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.45 లక్షల క్వింటాళ్ల కందులను ఆయా మార్కెట్ల ద్వారా కొనుగోలు చేయగా ఈఏడాది 31వేల క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈసారి 6వేల హెక్టార్లలోనే కంది పంట సాగు కావడంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి సైతం గణనీయంగా పడిపోయింది. దీంతో కందులు పెద్దగా మార్కెట్ వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా కందులు పండించిన రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దనే ఉద్దేశంతో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మద్ధ్దతు ధర సైతం ప్రభుత్వం అందజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది.

4 కేంద్రాల ద్వారా కందుల కొనుగోళ్లు
సంక్రాంతి తర్వాత కందులను కొనుగోలు చేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. నల్లగొండతో పాటు చండూరు, చిట్యాల, కొండమల్లేపల్లి ప్రాంతాలలో మార్క్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడం జరుగుతుంది. ఆయా మార్కెట్ అన్ని వసతులను కల్పించడంతో పాటు గన్నీబ్యాగులను సైతం సమకూర్చుతున్నాం. రైతులు దళారులకు విక్రయించకుండా మార్కెట్ విక్రయించి మద్ధ్దతు ధర పొందాలి. నాణ్యమైన కందులు తీసుకొస్తే మంచి ధర లభిస్తుంది.
-ఎంఏ అలీం, ఏడీ మార్కెటింగ్, నల్లగొండ

435
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...