ఆరుతడే మేలు..


Wed,January 9, 2019 02:48 AM

-తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేసుకునేందుకు అవకాశం
-జిల్లాలోని 90 శాతం నేలల్లో నీటి నిల్వ లక్షణాలు తక్కువే
-యాసంగిలో ఆరుతడిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు
-రైతులకు రాయితీపై విత్తనాలు
నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లాలో సాగు భూములు కలిగిన రైతులు రెండు పంటలు పండిస్తారు. వానాకాలం, యాసంగిలో కూడా ఒకే రకమైన పంటను సాగు చేయడం ద్వారా వేసవిలో సరిగా నీరందక దిగుబడి సరిగా రాక రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. గంపగుత్తాగా గాకుండా ప్రత్యామ్నయం దిశగా ముందుకు వెళుతూ తక్కువ కాలం, తక్కువ నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. వానాకాలంలో ఉన్న నీటి వనరులతో పాటు వర్షాలు సైతం మేలు చేయనున్న నేపథ్యంలో వరి సాగు చేసినప్పటికీ పెద్దగా నష్టం ఉండదు. కానీ యాసంగిలో మాత్రం వేసవి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్నందున తక్కువ పంట కాలం ఉండటంతో పాటు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుంటే మంచిదని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఆరుతడి పంటలవైపే దృష్టి సారించాలని వారు కోరుతున్నారు

సబ్సిడీతో విత్తనాల సరఫరా
యాసంగి సీజన్ ఆరు తడి పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీతో విత్తనాలను అందజేస్తోంది. విత్తనాలు అడిగిన ప్రతి రైతుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే మార్కెట్ అందుబాటులో ఉంచింది. గరిష్టంగా ప్రతి ఎకరానికి రూ. 1200 వరకు రాయితీ అందజేస్తు విత్తనాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. నిడమనూరులోని టీఎస్ సీడ్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలను అందజేస్తోంది. ప్రస్తుతం వెయ్యి క్వింటాళ్ల మినుములు, 500 క్వింటాళ్ల పెసలు మండల కేంద్రాల్లోని సహకార విక్రయ కేంద్రాల్లో ఉన్నాయి. ఇక ఉద్యానశాఖ నుంచి సైతం కూరగాయల విత్తనాలు సబ్సిడీలో అందజేస్తోంది.

ఆరు తడి పంటలతోనే అధిక లాభం
ఆరు తడి పంటల పంట కాలం తక్కువగా ఉండటంతో పాటు తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేయవచ్చు. దీంతో పాటు ఈ పంటల నుంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వానాకాలంలో సాగు చేసిన పంటే కాకుండా మారిస్తే మంచి ఫలితం రానుంది. టమాటాతో పాటు పచ్చిమిర్చి, దోస, వంగ, పుచ్చకాయలు సాగు చేసుకోవచ్చు. ఇవే కాకుండా మినుములు, పెసలు, వేరుసెనగ సైతం సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న , జొన్న, నువ్వులు, బొబ్బర్లు, పప్పు ధాన్యాలు సైతం సాగు చేయవచ్చు. వీటికి మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. కాలానుగుణంగా వీటి సాగు తక్కువ కావడంతో మార్కెట్ క్రమంగా డిమాండ్ పెరిగింది.

నీటి నిల్వ తక్కువ కలిగిన నేలలే ఎక్కువ
జిల్లాలో అధికంగా తేలిక పాటి, ఎర్రదుబ్బనేలలే ఉన్నాయి. 90 శాతం నేలలు ఇవే ఉన్నందున వీటిలో నీరు నిల్వ చేసుకునే లక్షణం తక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటంతో పాటు ప్రధాన , సూక్ష్మ పోషక పదార్థాల లభ్యత కనిష్టంగా ఉండటంతో జిల్లాలో భూగర్భ జలాల లభ్యత రోజు రోజుకు తగ్గిపోతుంది. ప్రధానంగా మునుగోడు, దేవరకొండ డివిజన్లలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అక్కడి రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఎకరం వరికి ఖర్చయ్యేటువంటి నీటితో 3 నుంచి 4 ఎకరాల్లో ఆరు తడి పంటలు వేయవచ్చును.

237
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...