చెరో దారిలో..


Sat,September 22, 2018 12:21 AM

- టీపీసీసీ కమిటీలపై కోమటిరెడ్డి సోదరుల విరుద్ధ ప్రకటనలు
- సంతృప్తిని వ్యక్తం చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి
- బ్రోకర్లకు పదవులు ఇచ్చారంటున్న ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
- అన్నకు సముచిత స్థానం దక్కినా తమ్ముడికి సంతృప్తి కరువు
- మునుగోడు టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడమే కారణమా?
- మిగిలిన కాసింత క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తున్న సోదరులు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేసి విస్తృత ప్రచారం పొందడం కాంగ్రెస్‌కు చెందిన ఆ సోదరుల నైజం. తమ పార్టీ అధిష్ఠానాన్ని, నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ.. కార్యకర్తలను అయోమయా నికి గురి చేయడం వారికి నిత్యకృత్యం. కానీ, ఈసారి మాత్రం సీన్ తిరగబడింది. తాజాగా అధిష్ఠానం ప్రకటించిన టీపీసీసీ కమిటీలు మాత్రం ఆ పార్టీ నాయకులైన కోమటిరెడ్డి సోదరుల మధ్యనే విభేదాలకు కారణమయ్యాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్‌గా తనకు కీలక పదవి దక్కిందని వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తుంటే.. బ్రోకర్లకు కమిటీల్లో పదవులు కట్టబెట్టారని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు. ఎప్పుడూ ముక్త కంఠంతో స్వపక్షం పైనే దాడి చేసే బ్రదర్స్.. ఈసారి చెరోపక్షం కావడం క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది.

ముందస్తు ఎన్నికల్లో విజయం సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు మాత్రం ఆ పార్టీలో కొత్త వర్గపోరును లేవనెత్తాయి. ఇప్పటికే ఆయా కమిటీలపై ఆ పార్టీకే చెందిన పలువురు సీనియర్లు బహిరంగ విమర్శలు చేస్తుండగా.. జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల స్పందన విరుద్ధంగా ఉండడం కొత్త ఆలోచనలకు తావిస్తోంది. రెండు రోజుల కిందట కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేయడంతో.. కొత్తగా ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీలంటూ పెద్ద జాబితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్‌తోపాటు పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కూడా స్థానం కల్పించింది. ఆయన సోదరుడైన ఎమెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సుమారు 50మందితో కూడిన ఎన్నికల కమిటీలో మాత్రమే చోటు దక్కింది. ఈ కమిటీలపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తూ కమిటీలను వేశారని కితాబిచ్చారు కూడా. కానీ వెంకటరెడ్డి తమ్ముడైన రాజగోపాల్‌రెడ్డి మాత్రం బ్రోకర్లకు, వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వాళ్లకు కమిటీల్లో చోటు కల్పించారని, కుంతియా శనిలా దాపురించాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సోదరుల వైరుధ్యానికి కారణాలేమిటో...
గతంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినపుడే కాకుండా అనేక సందర్భాల్లోనూ కోమటిరెడ్డి సోదరులిద్దరూ కలిసి కట్టుగా ఉత్తమ్ సహా తమ పార్టీ నేతల పైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి అన్నాదమ్ముళ్లిద్దరూ వేర్వేరుగా మాట్లాడడం కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. అన్నకు పదవి దక్కడమే తమ్ముడికి ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో తాను ఎప్పటికైనా కీలక నేతగా ఎదుగుతాననే అంచనాల్లో ఉన్నారని.. ఇప్పటి కమిటీల్లో ప్రాధాన్యం దక్కకపోవడం ఆయనను నిరాశకు గురి చేసిందని సన్నిహితులు చెప్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి సూచించిన నలుగురు అభ్యర్థులను అధిష్ఠానం పట్టించుకోకపోవడమే కారణమనే విశ్లేషణ సైతం వినిపిస్తోంది. ఇవేవీ కారణాలు కానే కావని.. మునుగోడు నుంచి పోటీ చేయాలని రాజగోపాల్‌రెడ్డి ఆశిస్తుండగా ఆయనకు ఆ టిక్కెట్ అవకాశం లేనందునే ఆగ్రహం, ఆవేదన వెల్లగక్కుతున్నాడని అదే పార్టీకి చెందిన మరో వర్గ సీనియర్ నాయకుడు వివరించడం గమనార్హం. అన్నాదమ్ముళ్లకు సైతం సరైన సఖ్యత లేదని.. ఈ పరిణామం ఏ నిర్ణయం వైపు దారి తీస్తుందో చూడాలనీ విశ్లేషించారు కూడా.

376
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...