దొంగ కూటమి వస్తున్నది తస్మాత్ జాగ్రత్త


Fri,September 21, 2018 01:51 AM

పెన్‌పహాడ్ : ఎన్నికలు వస్తున్నాయి.. మళ్లీ మూడు రంగుల పార్టీ, పచ్చ రంగు, ఎర్రజెండా పార్టీలు ఏకమై మహాకూటమి పేరు పెట్టుకొని దొంగ కూటమిగా ఏర్పడి మరొకసారి ప్రజలను వంచించేందుకు ఓట్ల కోసం వస్తున్నాయని అలాంటి చీకటి దొంగలకు బుద్ధ్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఉందని విద్యుత్, ఎస్సీ అభివృద్ధ్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద మహ్మదాపురం, సింగారెడ్డిపాలెం, అనంతారం, పెన్‌పహాడ్ గ్రామాల టీఆర్‌ఎస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. గత పాలకుల చేసిన భూ కబ్జాలు, రౌడీయిజంతో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు విసిగి వేసారి పోయారని తెలిపారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వారు వారి ఆగడాలకు తాళలేక వ్యాపారాలు మానుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో సూర్యాపేట నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని, ఎలాంటి వివాదాలు తలెత్తలేదని గుర్తు చేశారు. రౌడీయిజం, భూ కబ్జాలు చేసిన దాఖలాలు ఎక్కడా కన్పించలేదని ఏ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు కాలేదని వివరించారు. సూర్యాపేట సుభీక్షంగా ఉండాలంటే మంచి పనులకు పట్టం కట్టిన వారిని వదులుకోవద్దని పేట ప్రజలు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లోఅభివృద్ధ్ది..సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అఖండ మెజారిటీ సాధింంచి పెడతాయని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందిస్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించానని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని ముంచిన గత పాలకులు ఓట్ల కోసం చీకటి దొంగల అవతారం ఎత్తారని వారి తరిమి కొట్టాలని ప్రజలకు సూచించారు.

బూత్ లెవల్ కార్యకర్తలు విధిగా ఆయా వార్డుల్లో నూతన ఓటర్లు దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న అభివృద్ధ్ది సంక్షేమ పథకాలపై బూత్ లెవల్‌లో ప్రతి ఒక్కరికీ అవగహన కల్పించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల వారికి ఇంకా అమలు చేయాల్సిన వాటిపై కార్యకర్తలు పార్టీలో చర్చకు తీసుకురావాలన్నారు. మహా కూటమి ఏర్పాటు చేసినా.. అందరూ కలిసి ఎన్ని కుట్రలు, ఎత్తుగడులు వేసినా టీఆర్‌ఎస్‌ను ఓడించడం వారి తరం కాదని పేర్కొన్నారు. మండలంలోని 29గ్రామాల్లో బూత్ లెవల్ కమిటీలు నియమించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో కార్యకర్తలు అందించే విలువైన సేవలే భవిష్యత్‌లో వారికి మంచి గుర్తింపు తీసుకొస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ పిన్నేని కోటేశ్వర్‌రావు, మండలాధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, నెమ్మాది భిక్షం, మండాది నగేష్, టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...