రాజకీయ చైతన్యానికి పెట్టని కోటసూర్యాపేట


Thu,September 20, 2018 01:01 AM

- అన్నిపార్టీలను ఆధరించిన ప్రజానీకం
- 2014లో ఉద్యమపార్టీకి పట్టం కట్టిన జనం
- మళ్లీ టీఆర్‌ఎస్‌దే గెలుపంటున్న రాజకీయ విశ్లేషకులు
- ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు...
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన సూర్యాపేట నియోజకవర్గం రాజకీయాల్లో కూడా అత్యంత చైతన్యవంతమైంది. ఎంతో మంది ఉద్యమ నాయకులను చట్టసభల్లోకి పంపించి ఉద్యమ బిడ్డలను మర్చిపోకుండా గుండెల్లో పెట్టకొని చూస్తారని నిరూపించుకుంటూ వస్తుంది. దానికి ఉదాహరణే నాటి సాయుధ పోరాటంలో ఉద్దండులైన బీఎన్ రెడ్డి, ధర్మభిక్షం లాంటి వారిని ప్రజాప్రతినిధులుగా చేశారు. కడవరకు కటిక పేదరికంలోనే జీవితాన్ని గడిపి నిస్వార్థమైన రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న ఉప్పల మల్సూరును నాలుగుసార్లు గెలిపించి గొప్ప వ్యక్తితాన్ని కనబర్చిన ప్రజానీకం.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తోపాటు పద్నాలుగేళ్లపాటు నిరంతరాయంగా ఉద్యమంలో పాల్గొని విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని గత ఎన్నికల్లో సూర్యాపేట వాసులు గెలిపించారు. రాజకీయ చైతన్యానికి వేదికైన సూర్యాపేట ప్రజలు సూర్యాపేట నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు అన్ని పార్టీలను ఆదరించారు. సకల వనరులు ఉన్న నియోజకవర్గం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యాటకం తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది.

సూర్యాపేట.. ఈ పేరు తెలియనివారు దాదాపు రాష్ట్రంలో ఎవరూ ఉండరు. చరిత్రలో ఎంతో మంది మహానుబావులు చేసిన ఉద్యమాలు.. సాధించిన విజయాలకు నిలయం సూర్యాపేట. ప్రపంచ చరిత్రలోనే సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి ప్రాంతం సూర్యాపేట ప్రాంతం కావడం విశేషం. గ్రంథాలయ ఉద్యమం తదితర ఉద్యమాలకు పుట్టినిల్లు ఇది. అలాంటి సూర్యాపేట రాజకీయంగా కూడా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించి ఉంది. ఎంతో మంది ఉద్యమ నాయకులను చట్టసభల్లోకి పంపించి ఉద్యమ బిడ్డలను మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకొని చూస్తారని నిరూపించుకుంటూ వస్తుంది. రాజకీయ చైతన్యానికి వేదికైన సూర్యాపేట ప్రజలు సూర్యాపేట నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు అన్నిపార్టీలను ఆదరించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు పీడీఎఫ్, సీపీఐలు గెలుపొందగా ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగు మార్లు టీడీపీ, ఒకసారి టీఆర్‌ఎస్‌ను ఇక్కడి ప్రజలు గెలిపించారు. జిల్లాలోని అన్నినియోజకవర్గాలకు భిన్నంగా అన్నిపార్టీల వారికి అవకాశమిచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. 1952లో నియోజకవర్గంగా ఏర్పాటైంది. 1957వరకు సూర్యాపేట, తుంగతుర్తి కలిపి ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగి 1962నుంచి ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. మొదట తెలంగాణ సాయుధ పోరాట యోధులకు పట్టం కట్టిన ప్రజలు వరుసగా రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులను ఆధరించారు. పోరాటయోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డిలతోపాటు నిస్వార్థ జీవిగా పేరుగాంచిన ఉప్పల మల్సూర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడంతో సూర్యాపేట నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకభూమిక పోషించి ఆదర్శ నేతలుగా నిలిచిన పలువురు నాయకుల ప్రస్తానం సూర్యాపేట నుంచే ఆరంభమైంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

పునర్విభజనలో జనరల్ స్థానంగా మార్పు
1952లో ఏర్పడిన సూర్యాపేట నియోజకవర్గం గత 2009ఎన్నికల వరకు ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా కొనసాగింది. అనంతరం జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో జనరల్ స్థానంగా రూపాంతరం చెందింది. భౌగోళికంగానూ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, మోతె మండలాలతోపాటు ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పునర్విభజనలో సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్ మండలాలు మాత్రమే మిగిలాయి.

మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,576
నియోజకవర్గ పరిధిలో మొత్తం జనాభా 3,05,289 మంది జనాభా ఉండగా ఓటర్లు 1,94,576 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓటర్లలో 96,718మంది పురుషులు, 97,847 మంది మహిళలు ఉండగా 11మంది ఇతరులు ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు 1129 మంది అధికంగా ఉన్నారు.

అన్నింటా అగ్రగామిగా...
ఉద్యమాలు, ఉద్యమకారులకే పుట్టినిల్లు కాకుండా అన్ని రంగాల్లో అందె వేసింది సూర్యాపేట. అనేక చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలతోపాటు పరిశ్రమలు విరివిగానే ఉన్నాయి. సుమారు 20వేల ఎకరాలకు సాగునీటిని, నియోజకవర్గంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు సూర్యాపేట మండలానికి తాగునీటిని అందించే మూసీ ప్రాజెక్టు ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలైన సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని అత్యంత పురాతనమైన శివాలయాలు, మైదాన ప్రాంతమైన సూర్యాపేట నియోజకవర్గంలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ వద్ద ఏడు గుట్టలు.. వాటిపై పురాతన కట్టడాల ఆనవాళ్లు.. భారీ వృక్షసంపద, ఔషధ మొక్కలు, నీటి కొలనులు ఇలా మొత్తం మీద ముదురు ఆకుపచ్చదనం పులుముకున్న అడవి దర్శనమిస్తుంది. ఇక్కడే గుట్టపై లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరి భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర నడిచే పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయం, రెండో తిరుపతిగా పిలుచుకునే సూర్యాపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.

విద్య, వైద్యంలో టాప్...
విద్య, వైద్యం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే సూర్యాపేటకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి ర్యాంకులు వస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో పేరున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలతోపాటు ఇతర అనేక కోర్సులకు సంబంధించిన విద్యా సంస్థలు విరివిగానే ఉన్నాయి. అత్యధికంగా జాతీయ రహదారి ఉన్న సూర్యాపేటలో ప్రైవేట్ మల్టీస్పెషాలిటీ దవాఖానలతోపాటు ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో మంచి వైద్యం అందుతుంది.

అదనంగా మెడికల్ కళాశాల : ఇప్పటికే వైద్యపరంగా ముందంజలో ఉన్న సూర్యాపేటలో విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చొరవతో మెడికల్ కళాశాల మంజూరైంది. సూర్యాపేట ఏరియా దవాఖానను 300పడకల దవాఖానగా చేసేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...