ప్రజల బాధలు తీర్చేది టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే


Thu,September 13, 2018 12:46 AM

చండూరు, నమస్తే తెలంగాణ (మునుగోడు) : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాల్లో వెనుకబడిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వం లోని టీఆర్‌ఎస్‌వల్ల మాత్రమే సాధ్యమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మొదటి సారిగా బుధవారం మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రచార రథం నుంచి ఎంపీ బడుగుల మాట్లాడుతూ స్వాతంత్య్ర భారతదేశంలో కుటుంబ పాలన చేసింది కేవలం కాంగ్రెస్ మాత్రమే అన్నారు. నాటి మోతీలాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కుటుంబ పాలన చేస్తూనే ప్రజలను మభ్యపెట్టేందుకు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూసే మహానుబావుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల కాలంలో చేయలేని పనులనేకం చేసి ప్రజలకు మేలు జరిగేలా చేశారన్నారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముందుగా రూ. 17వేల కోట్ల రైతుల పంటరుణాలు మాఫీ చేయడంతో పాటు ప్రస్తుతం ఎకరానికి రూ. 8వేల చొప్పున పంటసాయం అందించడంతో పాటు రూ.5 లక్షల ఉచిత బీమా అందిస్తున్నది కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు.

అభివృద్ధి నిరోధక కాంగ్రెస్‌ను తరమికొట్టాలి : ఎంపీ బూర
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డా॥ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గతంలో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన మునుగోడు నియోజకవర్గం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి వైపునకు అడుగులు వేస్తున్నదన్నారు. 66 ఏండ్లలో చేయని అభివృద్ధి కేవలం నాలుగున్నరేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇంతకాలం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌కు ఓట్లెందుకు వేయాలో ప్రజలు తమవద్దకు వచ్చే నాయకులను ప్రశ్నించాలని కోరారు.

ప్రజల సేవకుడిగా ఉంటా : కూసుకుంట్ల
ఎప్పటికైనా తాను నాయకుడిగా కాకుండా ప్రజల సేవకుడిగానే ఉంటానని మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను కేసీఆర్ ఆశీర్వదించి పంపితే మునుగోడు ప్రజలు అక్కున చేర్చుకొని అసెంబ్లీకి పంపారన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు సీఎం కేసీఆర్ రూ. 6వేల 2వందల కోట్లతో లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లను మంజూరు చేసి యుద్దప్రాతిపదికన పనులు మొదలు పెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కేసులు వేయించి అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరడ్డుకున్నా వాటిని పూర్తి చేసి తీరుతామన్నారు. ప్రజలు తనను మరోసారి దీవించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్ల మార్కండేయ, జడ్పీటీసీలు పెద్దిటి బుచ్చిరెడ్డి, ఏడుదొడ్ల శ్వేత, అన్నెపర్తి సంతోషశేఖర్, ఎంపీపీలు మేడి నాగలక్ష్మియాదయ్య, తోకల వెంకన్న, మార్కెట్ చైర్మన్ కరంటోతు జగ్రాం నాయక్, గుర్రం వెంకట్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు నర్సింహాగౌడ్, పెద్దగోని వెంకన్న గౌడ్, పానగంటి వెంకన్న గౌడ్, దంటు జగదీశ్వర్, రైసస మండల కన్వీనర్లు బొమ్మరబోయిన వెంకన్న, ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, పాశం సురేందర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

178
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...