ఆయకట్టులో సాగు సందడి


Wed,September 5, 2018 01:42 AM

ఉమ్మడి జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు
సాగర్ ఆయకట్టులోనే 3.75 లక్షల ఎకరాలు
తెలంగాణ ప్రభుత్వ చొరవతో రైతాంగానికి ఫలితాలు
ప్రతి చుక్కనూ వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రణాళిక
అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ పూర్తిగా భూముల సాగు
చరిత్రలో తొలిసారి మూసీ నుంచి వానాకాలానికి నీటి విడుదల
డిండి, ఏఎమ్మార్పీ కాల్వల పరిధిలోనూ సాగు కళ
ప్రస్తుతం నీరు అందుతున్న భూమి (ఎకరాల్లో)..
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ 3,75,681
ఏఎమ్మార్పీ ఎగువ కాల్వ - 90,000(డి38 వరకు)
మూసీ ప్రాజెక్టు 25,000
శాలిగౌరారం 3,000
బునాదిగాని కాల్వ 8,000
లోలెవెల్ కాల్వ 25,000
పిలాయిపల్లి 10,000
డిండి 12,835
ఆసిఫ్ నెహర్ 15,246

నీటి సోయిని గుర్తించి ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి నీటి చుక్కా వినియోగంలోకి వస్తోంది. మూసీ నుంచి పొంగి పొర్లి వృథాగా పోవాల్సిన నీటిని ప్రాజెక్టు మరమ్మతులతో ఏడాది మొత్తం బంధిస్తున్న ఫలం.. మూసీ కాల్వలను సరికొత్తగా తీర్చిదిద్దిన వైనం.. ఎడమ కాల్వను పక్కాగా ఆధునీకరించి సాగర్ నిండక ముందే ఆయకట్టుకు నీటిని విడుదల చేయించిన ప్రయత్నం.. ఏఎమ్మార్పీ ఎగువ, దిగువ కాల్వలకు సైతం నీళ్లిస్తున్న విధానం.. వెరసి ఒకటో రెండో కాదు ఏకంగా సుమారు 6 లక్షల ఎకరాల భూమి ఆయా ప్రాజెక్టుల నుంచి అందుతున్న నీటితోనే సాగవుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఉన్న కాల్వ తొలిజోన్‌లోని 3.75 లక్షల ఎకరాలతోపాటు.. ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి వానాకాలం సాగుకు నీటిని అందిస్తున్న మూసీ జలాశయం పరిధిలో 25 వేల ఎకరాలు.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రస్తుత సీజన్‌లో సాగు సందడి జోరందుకుంది. 2.2 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన ఏఎమ్మార్పీ ఎగువ కాల్వ పరిధిలోనూ ప్రతి చెరువూ నిండుతుండగా.. 80 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన లోలెవెల్ కాల్వ (వరద కాల్వ) కింద కూడా కృష్ణమ్మ గలగలా పారుతోంది. ఆయకట్టు అంతటా ఆనందం నింపుతోంది.
- నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరుణుడు అంతగా కరుణించకపోయినా.. తెలంగాణ ప్రభుత్వ ముందు చూపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సాగు సందడి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలోనూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగు నీరు అందుతుండడంతో రైతాంగం పూర్తిగా సాగు బడిలో మునిగి పోయింది. నాగార్జునసాగర్ జలాశయం నాలుగేండ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండడం.. ప్రాజెక్టు పూర్తిగా నిండక ముందే నీటి విడుదలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఎడమ కాల్వ పరిధిలో ఉన్న జోన్-1లో మొత్తం 3,75,681 ఎకరాల్లో చివరి భూములకు సైతం నీళ్లిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని పక్కాగా పని చేయిస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండడంతోపాటు అంతకు ముందే కాల్వల ఆధునీకరణను సైతం పక్కాగా పూర్తి చేయించిన నేపథ్యంలో గతేడాదే పలు మేజర్ల పరిధిలో తొలిసారి చివరి భూముల్లో సైతం పంటలు పండిన సంగతి తెలిసిందే. మరోవైపు మూసీ ఆయకట్టులోనూ రైతాంగం గతంలో ఎన్నడూ లేనంత సంబురంగా సాగు చేస్తోంది. 55 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ ప్రాజెక్టు పరిధిలో వానాకాలం సాగు నీటిని అందించిన సందర్భం లేదు. అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 18.77 కోట్లతో మూసీ గేట్లకు సమూలంగా మరమ్మతులు చేయించింది. కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణకు సైతం రూ. 65 కోట్లతో పనులు మొదలు పెట్టనుంది. కొత్త గేట్ల ఫలితంగా గతంలో వృథాగా దిగువకు వెళ్లి కృష్ణా ద్వారా సముద్రంలో కలిసిన విలువైన జలాలు నేడు మూసీ రిజర్వాయర్‌లోనే పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ చొరవతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల ఎకరాల్లో ఏటా రెండు పంటల సాగుతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత వానాకాలం మూసీ జలాశయం నుంచి మొత్తం 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఆయకట్టులో సాగుసందడి

డిండి జలాశయం పరిధిలోనూ ప్రస్తుతం మొత్తం సాగు భూమి 12,835 ఎకరాలకూ సాగు నీరు అందుతోంది. నాలుగేండ్లుగా డిండి పరిధిలో సాగు నీటి విడుదల జరగకపోగా.. గతేడాది ప్రభుత్వం చొరవ తీసుకొని మండు వేసవి కాలంలో తొలిసారి కాల్వల చివర ఉన్న చెరువులు సైతం నింపింది. మారుమూల మండలాలైన చందంపేట, నేరేడుగొమ్మ పరిధిలో ఉన్న 36 చెరువులను తొలిసారి నింపడమే కాకుండా.. ప్రాజెక్టు పరిధిలోని 38 డిస్ట్రిబ్యూటీరీల పొడవున ఉన్న 60 చెరువులకు సైతం మరమ్మతులు చేపట్టి కొత్త కళను తెచ్చింది. నాగార్జున సాగర్, మూసీతోపాటు డిండికి సైతం ఈ సారి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేసి అధికారికంగా 12,835 ఎకరాలకు నీళ్లిస్తుండగా.. మరో 6 వేల ఎకరాలు ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో లబ్ధి పొందుతోంది. మూసీ కాల్వలు అయిన ఆసిఫ్‌నెహర్ పరిధిలో 15,246 ఎకరాలకు సాగునీరు అందుతోంది. బునాదిగాని కాల్వ పరిధిలో 20,575 ఎకరాలు ఉండగా.. 8000 ఎకరాలకు, పిలాయిపల్లి 22,500 ఎకరాల మొత్తం భూమికి 10,000.. ధర్మారెడ్డిపల్లి పరిధిలోని 17,787 మొత్తం భూమిలో 6వేల ఎకరాలు ప్రస్తుత సీజన్‌లో సాగునీరు పొందుతున్నాయి. శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని 3వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకూ నీళ్లందుతున్న సంగతి తెలిసిందే. ఏఎమ్మార్పీ ఎగువ కాల్వ పరిధిలో 2,20,000 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఏడాది డీ-38 వరకు ఉన్న 90,000 ఎకరాలకు సాగు నీరు అందించేలా ఏర్పాట్లు చేపట్టారు. లో లెవెల్ కాల్వ(వరదకాల్వ) పరిధిలో గ్రావిటీ ద్వారా 50,000 ఎకరాలు, లిఫ్ట్ ద్వారా 30,000 ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా.. ఈసారి ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు సరఫరా అవుతోంది.

డిండి ఆయకట్టు పరిధిలో...

డిండి : నాలుగేండ్ల తర్వాత డిండి ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు నత్తనడకన సాగగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు నూతన ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేస్తుంది. ఈ క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మాణం పనులు పూర్తిచేసి రెండేళ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు మూడు లక్షలకు పైగా ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. అంతేకాకుండా గత సంవత్సరం సీఎం కేసీఆర్ ఆదేశంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని వదిలి డిండి ప్రాజెక్టును నింపారు. ఆగష్టు 21న మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, జడ్పీచైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ చేతుల మీదుగా డిండి ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు వదిలారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన పని చేస్తుందనే భరోసాతో ఆయకట్టు రైతులు ఆనందంలో ఉన్నారు.

కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా

టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల్లో భరోసా నింపింది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందిందేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. అదే క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికావడంతో ఆ నీటితో గత సంవత్సరం డిండి ప్రాజెక్టును నింపడంతో వానాకాలం పంట సాగు చేశాం.
-ముత్యాల రాంరెడ్డి, రైతు, చెర్కుపల్లి, డిండి మం.

వరదకాల్వ నీటితో సస్యశ్యామలం

నిడమనూరు : మండలంలో వరద కాల్వ పరిధిలోని వ్యవసాయ భూములు సాగు నీటితో సస్యశ్యామలంగా మారాయి. కాల్వ పరిధిలోని మారుపాక, ఎర్రబెల్లి, గుంటిపల్లి, గారకుంటపాలెం గ్రామాల పరిధిలో భూగర్భజలాలు అనూహ్యంగా పెరగడంతోపాటు చెరువులు పూర్తి స్థాయిలో నింపడంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో రైతులు సాగుకు ఉత్సాహం చూపుతున్నారు.

ప్రభుత్వం చొరవతో పంటల సాగు

ప్రభుత్వం చొరవతో వరద కాల్వ నీటితో పంటల సాగు చేస్తున్నాం. గతంలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడి తోటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితులు ఉండేవి. నేడు వరదకాల్వ నీటితో చెరువు నింపడంతో యాసంగి, వానాకాలం పంటలు సాగు చేస్తున్నాం. చెరువు పరిధిలో నాకున్న 3ఎకరాల వ్యవసాయ భూమి లో వరి సాగు చేస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించా. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - సండ్రాల సైదులు, గుంటిపల్లి

కోదాడ మండలంలో...

కోదాడ రూరల్ : సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలతో మండలంలోని ఆర్‌కే మేజర్ కింద రైతులు పొలాలు దున్నడం ప్రారంభించారు. చెరువులు, బోర్లకింద ఇప్పటికే నాటు వేసిన పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండి భూగర్భజలాలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు పంటలకు ఢోకా లేనట్లే..

స్వరాష్ట్రంలో సాగునీటి కష్టాలు పూర్తిగా తొలిగాయి. గతం కంటే ఇప్పుడు నెల రోజుల ముందే ప్రభుత్వం సాగుకు నీటి విడుదల చేయడం సంతోషకరం. గతంలో సాగర్ నీటి విడుదల కోసం ధర్నాలు, ఉద్యమాలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వ్యవసాయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది సాగర్ ప్రాజెక్టు నిండడంతో రెండు పంటలకు ఢోకా ఉండదు.
-కె.వెంకటేశ్వర్లు, రైతు, నడిగూడెం

ఆనందోత్సాహంలో రైతన్నలు..

అడవిదేవులపల్లి : కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్‌తో సైతం ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. దీంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆనందోత్సాహంతో వరి సాగులో నిమగ్నమయ్యారు.

నీటి విడుదల శుభపరిణామం

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేయడం శుభ పరిణామం. ఎడమకాల్వకు నీటి విడుదలకు ముందు భూములన్నీ బీళ్లుగా ఉన్నాయి. ఈతరుణంలో ఆగస్టు 23న ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు.
- మార్తి సతీష్‌రెడ్డి, రైతు, త్రిపురారం

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...