ముమ్మరంగా వరినాట్లు


Wed,September 5, 2018 01:40 AM

- త్వరలో ఎత్తిపోతల పథకాలకు సైతం సాగునీరు
- వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీ
హాలియా, నమస్తే తెలంగాణ : బహుళార్థక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద సాగు జోరు కొనసాగుతోంది. కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఇప్పటికే పూర్తిగా నిండాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 587అడుగులకు చేరింది. సాగర్ ఎడమకాల్వ ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని మొదటి, రెండో జోన్ల కింద 6.25లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది నీరందనున్నది. నాలుగేండ్ల తర్వాత వానాకాలం సాగుకు ఆయకట్టు ప్రాంతానికి ఆగస్టు23న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నవంబర్ 20 వరకు ఆయకట్టుకు మొత్తం ఆరు తడుల్లో 40టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. ఎడమకాల్వపై ఉన్న మొదటి మేజర్ రాజవరం మొదలుకొని సూరేపల్లి, పేరూరు, నారెళ్లగూడెం, ముదిమాణిక్యం, వజీరాబాద్ తదితర మేజర్ల కింది చివరి భూములకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషిచేస్తుంది.

వరదకాల్వ పరిధిలోని చెరువులకూ ...
జిల్లాలోని వరదకాల్వ ఎత్తిపోతల పథకాలకూ ఈ ఏడాది ప్రభుత్వం సాగునీరు అందించనున్నది. ఇప్పటికే శ్రీశైలం లోలెవెల్ కెనాల్(వరదకాల్వ) ద్వారా జిల్లాలోని పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి మండలాల్లోని 50చెరువులు, కుంటలు సాగర్ నీటితో నింపుతున్నారు. ఈ క్రమంలో వరదకాల్వ పరిదిలోని 80వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 22న ఎస్‌ఎల్‌బీసీ లోలెవెల్ కెనాల్‌కు మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నీటి విడుదల చేశారు.

త్వరలో ఎత్తిపోతల పథకాలకూ..
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితోపాటు కృష్ణాబోర్డు తెలంగాణఖు కేటాయించిన నీటి వాటాతో ఎడమకాల్వ ఆయకట్టుతోపాటు దానిపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకూ ఈ ఏడాది సాగునీరు అందనున్నది. ఇందుకు ఐడీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల కింద సాగునీటిని విడుదల చేస్తామని ఇప్పటికే మంత్రి జగదీష్‌రెడ్డి లిఫ్టు రైతాంగానికి హామీ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే లిఫ్టులకు కూడా సాగునీరు విడుదల కానుంది. ఇప్పటికే ఎడమకాల్వ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఎత్తిపోతల పథకాలకూ మరమ్మతులు చేపట్టారు.

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతాగం
ఆగస్టులోనే ఎడమకాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతాంగం ఆనందానికి అవధుల్లేవు. సుమారు నాలుగేండ్ల తరువాత ఆయకట్టు ప్రాంతంలో పూర్తిస్థాయిలో వానాకాలం సాగుకు సాగర్ నీరు వదలడంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతాంగం రుణపడి ఉంటుంది. నీటి విడుదలతో రైతన్నలు వరినాట్లు ముమ్మరం చేశారు.
- చేగొండి కృష్ణాయాదవ్, రైతు సమన్వయ సమితి సభ్యుడు, అనుముల

221
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...