మూసీ ఆయకట్టు కళకళ


Wed,September 5, 2018 01:40 AM

-సాగుపనుల్లో అన్నదాతలు
సూర్యాపేటరూరల్ : ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్టయిన మూసీ ప్రాజెక్టు నిండడంతో వానాకాలం పంటల సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. మూసీ కాల్వల నుంచి సాగు నీరు విడుదల చేయడంతో మూసీ ఆయకట్టు కింద ఉన్న రైతాంగం వరినాట్లు వేసేందుకు పొలాలు దున్నుతున్నారు. ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంత్రి జగదీష్‌రెడ్డి సుమారు రూ.19కోట్లతో మూసీ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించడంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటితో నేడు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.
30ఏండ్ల తర్వాత నీటి విడుదల
గతంలో ప్రాజెక్టులో నీళ్లు సరిగ్గా ఉండకపోవడంతో ఎకరం మాత్రమే సాగు చేసేవాణ్ని. ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు నీటి కొరత లేదు. 30ఏండ్లలో మూసీ కాల్వలకు వానాకాలంలో నీటిని విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో ఇప్పుడు కాల్వలకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉంది.
-చందునాయక్, రామారం
గేట్లు బాగు చేయడంతోనే నీరు
ఇన్నాళ్లూ గేట్ల నుంచి నీళ్లు పోతుండడంతో ఎన్ని వర్షాలు కురిసినా నీళ్లు నిల్వ ఉండేవి కావు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో మూసీ గేట్లను బాగు చేయించడంతో మూసీ నిండుకుండలా చూడముచ్చటగా ఉంది. దీంతో నాకున్న రెండెకరాల భూమిని సాగు చేశాను. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతులకు మంచి చేస్తుండు.
-భూపతి అంజయ్య, రత్నపురం

మాడ్గులపల్లి మండలంలో..
మాడ్గులపల్లి : వర్షాలు సమృద్ధిగా కురవడంతో మండలంలోని రైతులు వరిసాగు అధికంగా చేస్తున్నారు. అంతేకాకుండా మూసీ ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో మండలంలోని పాములపహాడ్, పోరెడ్డిగూడెం, చిరుమర్తి, కల్వెలపాలెం, బీమనపల్లి గ్రామాల్లో అధికంగా వరి సాగు చేశారు. కొందమంది రైతులు ముందస్తుగానే బోర్లకింద వరి సాగు చేయగా, మూసీ ఆయకట్టుకు నీటిని విడుదలతో సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నాన్ ఆయకట్టు ఏరియాలో సైతం చెరువులు, వాగుల కింద వరి సాగు చేస్తున్నారు. మండలంలో గత సంవత్సరం కంటే 20శాతం అధికంగా వరి సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మిర్యాలగూడ మండలంలో..
మిర్యాలగూడ రూరల్ : సాగర్ ఎడమ కాల్వతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని 23చెరువులు నిండుకుండలా మారడంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

ఆనందంలో రైతులు..
త్రిపురారం : తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా ఈనెల 23న సాగునీటిని విడుదల చేసింది. దీంతో ఎడమకాల్వ పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఎడమకాల్వ పరిధిలో సుమారు 11700 హెక్టార్ల భూమి ఉంది. ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయడంతో ఈ భూములన్నీ సాగులోకి రానున్నాయి. దీంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.

203
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...